
జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. అక్కడ కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది ప్రస్తుతం సినిమాలలో బిజీ బిజీగా ఉంటున్నారు. హీరోలుగా మాత్రమే కాకుండా డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా కూడా సత్తా చాటుతున్నారు. జబర్దస్త్ లో ఇప్పుడంటే లేడీ కమెడియన్లు ఉన్నారు కానీ ఒకప్పుడు మేల్ యాక్టర్సే లేడీ గెటప్పులు వేసేవారు. చమ్మక్ చంద్ర మొదలు వినోదిని, తన్మయి, కొమరక్క ఇలా చాలా మంది లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించారు. అలా పలు జబర్దస్త్ స్కిట్లలో లేడీ గెటప్పుల్లో కనిపించిన వారిలో హరికృష్ణ ఒకడు. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. పై ఫొటో చూస్తే ఠక్కున గుర్తు పడతారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో పడన కష్టాలను అందరితో పంచుకున్నాడు. అలాగే జబర్దస్త్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘జబర్దస్త్ షో కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు. కంపెనీ కాస్ట్యూమ్స్ కాకుండా మేము సొంత కాస్ట్యూమ్స్ తో లేడీ గెటప్ వేసుకునే వాళ్లం. కానీ కొన్నిసార్లు మాత్రమే స్కిట్ కి పిలుస్తారు. మరి కొన్నిసార్లు పిలవరు. అయినా వాటి ఖర్చు మేము భరించే వాళ్లం. ఒకప్పుడు లేడీ గెటప్ లో మేము వేస్తే ఆ కామెడీ వేరే లెవెల్ లో ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఒకప్పుడు జబర్దస్త్ లో మాకు మంచి డిమాండ్ ఉండేది. లేడీ గెటప్ లు వేయడానికి మమ్మల్ని తప్ప వేరే వాళ్లను తీసుకునే వాళ్లు కాదు. కొన్నిసార్లు మేం నిజంగానే లేడీస్ అని చాలామంది ఇబ్బందులు పెట్టేవారు. ఒకసారి నన్ను లేడీ గెటప్ లో ఉండగా కొందరు ఆకతాయిలు లాక్కొని పొలాల్లోకి తీసుకొని వెళ్లారు. అక్కడ జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. ఈమధ్య మాకు అవకాశాలు రావడం తక్కువ అయ్యాయి. ఈ కామెడీ స్కిట్లు చేయడం తప్ప మకు మరే పని రాదు. అవకాశాలు ఈరోజు కాకపోతే రేపు వస్తాయి అని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. కొన్ని ఈవెంట్లతో వచ్చిన డబ్బుల ద్వారా ఫ్యామిలీని అలా నడిపిస్తున్నాను. మళ్లీ జబర్దస్త్ లాంటి షో లలో అవకాశాలు వస్తే నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం’ అని ఎమోషనల్ అయ్యాడు హరికృష్ణ. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.