
బిగ్బాస్ రియాల్టీ షో సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. గతేడాది డిసెంబర్ నెలలో విధ్వంసం, అల్లర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించిన కేసులో ప్రశాంత్.. అతడి సోదరుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. జైలుకు వెళ్లిన రెండు రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పై విడుదలైన ప్రశాంత్ కోర్టు కండిషన్స్ ప్రకారం.. ప్రతి నెల జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ కేసులో ప్రశాంత్ కు ఊరట లభించింది. ఇక పై అతను జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానవసరం లేదని కోర్టు పేర్కొంది. కోర్టు విధించిన రెండు నెలల గడువు పూర్తి కావడంతో ప్రశాంత్ తరపు లాయర్లు రిలాక్సేషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంత్ తోపాటు.. అతడి సోదరుడు ఇకపై పోలీసులు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెల్చీ చెప్పింది. దీంతో ఈ కేసులో ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లే.
రైతుబిడ్డగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో.. ప్రవర్తనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని సీజన్ 7 విజేతగా నిలిచాడు. కానీ విన్నర్ అయ్యాక కొన్ని గంటల్లోనే అల్లర్ల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట ప్రశాంత్ అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడికి పాల్పడ్డారు. లా అండ్ ఆర్టర్ అదుపుతప్పడంతో పోలీసులు.. ప్రశాంత్ ను స్టూడియో వెనక గేటు నుంచి వెళ్లాలని ఎలాంటి ర్యాలీలు తీయకూడదని సూచించారు . కానీ పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ తన ఫ్యాన్స్ మధ్యకు వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు ప్రశాంత్. దీంతో అల్లర్లు, విధ్వంసం కేసులో ఏ1 గా ప్రశాంత్.. ఏ2గా అతడి సోదరుడి పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక ఇప్పుడు ఈ కేసులో కోర్టు నుంచి ఊరట లభించడంతో తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేశాడు ప్రశాంత్. “ఎప్పటికైనా న్యాయమే గెలుస్తది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పాటకు తన వీడియోస్.. లాయర్ మాట్లాడిన వీడియోను జత చేశాడు. ప్రస్తుతం అతడు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ప్రశాంత్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది.. కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.