బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఎనిమిదో వారం వీకెండ్ కు వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వీక్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ నడుస్తోంది. నామినేషన్స్ లో ఉన్న కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి అలియాస్ మోనితకు తక్కువ ఓట్లు వచ్చాయని, అందుకే ఈ వారం ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఉల్టా పుల్టా అంటూ సీజన్ ప్రారంభం నుంచి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తోన్న బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్‌లోనూ ఒక సడెన్ ట్విస్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏడో సీజన్ లో మొదటి సారిగా ఒక మేల్ కంటెస్టెంట్‌ను హౌజ్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటింగ్‌లో శోభతో పాటు సందీప్ మాస్టర్ కు కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ సీజన్‌లో మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామినీ, రతికా రోజ్ (మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది), శుభ శ్రీ రాయగురు, నయని పావని, పూజా మూర్తి.. ఇలా ఏడు వారాల్లో ఏడుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ అమ్మాయిల మీద కక్ష కట్టాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ పవాదను పోగొట్టుకునేందుకు మొదటిసారిగా సందీప్ మాస్టర్‌ను బయటకు పంపిస్తున్నారని సమాచారం.
కాగా బిగ్ బాస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో సందీప్ మాస్టర్ కూడా ఒకరు. దీనికి తోడు అతను మొదటి వారం నుంచి ఎనిమిదో వారం వరకు నామినేషన్లలోకి కూడా రాలేదు. తద్వారా బిగ్ బాస్ చరిత్రలో వరుసగా ఎనిమిది వారాల పాటు నామినేట్ కాని ఏకైక కంటెస్టెంట్‌గా మాస్టర్ రికార్డు సృష్టించాడు. అయితే ఇదే సందీప్‌కు మైనస్‌గా మారిందని తెలుస్తోంది. నామినేషన్స్‌లో లేకపోవడంతో సందీప్ మాస్టర్‌కు ఓటు బ్యాంక్ కూడా పెద్దగా లేదు. దీంతో తొలిసారి నామినేషన్స్ లో వచ్చిన అతనికి తక్కువ ఓట్లు పడ్డాయట. అయితే ఓటింగ్ విషయంలో శోభ కంటే మెరుగైన స్థానంలోనే ఉన్నారు మాస్టర్. అయితే వరుసగా మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడంపై వస్తోన్న విమర్శలను పోగొట్టుకునేందుకు బిగ్ బాస్ సందీప్ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశాడని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.