
బిగ్‌బాస్ సీజన్ 9.. చివరి అంకానికి చేరుకుంది. ఇప్పుడు విన్నర్ రేసులో తనూజ, కళ్యాణ్ ఉండగా.. వీరిద్దరికి పోటీగా ఇమ్మూ సైతం దూసుకుపోతున్నాడు. అయితే ఈ సీజన్ ముందు నుంచి నెగిటివిటీ లేకుండా తన ఆట తీరుతో కట్టిపడేశాడు ఇమ్మూ. మొదటి రోజు నుంచి.. ఇప్పటివరకు హౌస్ లో ఎన్ని గొడవలు జరిగినా.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే అటు టాస్కులలోనూ అదరగొట్టేస్తున్నాడు. నిజానికి ఈ సీజన్ మొత్తానికి ఇమ్మూ హీరో అనేది ప్రేక్షకుల మనసులలో ఉన్న అభిప్రాయం. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో అదిరిపోయింది. టాప్ 5లో జర్నీ వీడియోల్లో భాగంగా ముందుగా ఇమ్మాన్యుయేల్ ప్రయాణాన్ని చూపించాడు బిగ్‌బాస్.
ముందుగా గార్డెన్ ఏరియాలో ఫుల్ సెటప్ చేశారు. అందులో ఇమ్మూ గెలిచిన టాస్కులకు సంబంధించిన వస్తువులు.. తన ఫ్రెండ్స్ తో పంచుకున్న మెమొరీస్.. తన తల్లి వచ్చిన ఫోటోస్ అందంగా సెటప్ చేశారు. ఒక్కో ఫోటో, బిగ్‌బాస్ జ్ఞాపకాలు చూసి మురిసిపోయాడు ఇమ్మూ. ఆ తర్వాత ఇమ్మూపై బిగ్‌బాస్ ప్రశంసలు కురిపించారు. “బాధ, ఆశ, ఓటమి.. ఈ భావోద్వేగాల నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. అందుకే వాటి నుంచి తేరుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లడానికి మాటి మాటికి మనుషులు కోరుకునే ఎమోషన్ ఆనందం. ఎలాంటి భేదం లేకుండా అందరికి సంతోషాన్ని పంచేవారే ఎంటర్టైనర్స్. వీరికి ప్రేక్షకులు, ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. అందుకు నిదర్శనమే మీ ప్రయాణం. చిన్నప్పటి నుంచి కష్టాలను స్వయంగా అనుభవించినవారికే చిరునవ్వు బలం తెలుస్తోంది. మీరు మీ నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. మాటలే మీ ఆయుధాలు. తెలివితేటలే మీ గేమ్ ప్లాన్.
మీ అల్లరికి మీ మమ్మీ కూడా తోడైంది. ఇంటి సభ్యులు మీకు దగ్గరై వారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాట మార్చలేదు. వారి తోడూ వీడలేదు.. మీ ఆటలో, భావాల్లో ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నారు. మంచి వైపు నిల్చనున్నారు. దగ్గరివారు చేసింది తప్పు అనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఏం జరిగినా ఆట మీద ఏకాగ్రత మాత్రం కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలాగైనా ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. అంత షార్ప్ గా ఉన్నప్పుడు మీ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి. ప్రేక్షకుల మనసు గెలిచేందుకు గొప్ప మనిషిగా ఇమ్మాన్యుయేల్ ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు. గొప్ప చదువులు అక్కర్లేదు. ఆడంబరాలు అక్కర్లేదు. కావాల్సింది క్యారెక్టర్ ఒక్కటే. కమెడియన్ గా అడుగుపెట్టిన హీరోగా రావాలనే మీ అమ్మ కల నిజమైంది” అంటూ పొగడ్తలు కురిపించారు బిగ్‌బాస్ .దీంతో ఇమ్మాన్యుయేల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తర్వాత ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో మాత్రం అదిరిపోయింది.
మొదటి రోజు నుంచి ప్రతి ఇంటి సభ్యుడితో ఇమ్మూ ఆట తీరు, ప్రవర్తన, నవ్వులు, ఏడుపు ప్రతిదీ చూపించారు. ముఖ్యంగా ఇమ్మూ ఫ్రెండ్షిప్, సంజనతో బాండింగ్, త్యాగాలు చూపించిన తీరు వేరేలెవల్. మొత్తానికి ఇమ్మూ జర్నీ వీడియో గూస్ బంప్స్. ఇక్కడ రెండే దార్లు ఉంటాయ్ ఒకటి గెలవడం.. రెండోది ఎలా గెలిచాం అంతే.. అంటూ ఇమ్మూ చెప్పిన డైలాగ్ మరో హైలెట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..