Kota Srinivasrao: కోట శ్రీనివాసరావు మృతి.. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సంతాపం!

ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు 83వ ఏట కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడిగా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ కూడా సంతాపం తెలిపారు.

Kota Srinivasrao: కోట శ్రీనివాసరావు మృతి.. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సంతాపం!
Kota Srinivasa Rao

Updated on: Jul 14, 2025 | 11:46 AM

విలక్షణ నటుడు, తెలుగు చిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరావు 83వ ఏట కాలం చేశారు. నాలుగు దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు. ఆయన మృతి పట్ల యావత్‌ సినీ రంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి వెళ్లి, ఆయన భౌతియకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ సహా.. ఎంతో మంది నటీనటులు కోటకు కడసారి వీడ్కోలు పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సోషల్‌ మీడియా వేదికగా కోట మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, మన హైదరాబాద్‌కు చెందిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం తాజాగా కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు. ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. “కోట శ్రీనివాసరావు గారు మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు అవధులు లేవు! విలన్ నుండి హాస్యనటుడు వరకు వివిధ రకాల పాత్రలను, మన హృదయాలను తాకిన భావోద్వేగాలను ఆయన అప్రయత్నంగానే చిత్రీకరించారు! మిమ్మల్ని మేము మిస్ అవుతాము సార్.” అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.