సూపర్‌స్టార్ మహేష్ బాబు షూటింగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో భాగంగా ఇవాళ చందానగర్‌లో మహేష్ ఫొటోషూట్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ను చూసేందుకు అక్కడకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడకు చేరుకున్న మహేష్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు అక్కడకు చేరుకున్న అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో వరుస రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ ఈ మూవీతో హ్యాట్రిక్‌ను కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే వరుసగా నాలుగు హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి, ఈ మూవీతో ఐదో హిట్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.