
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న కాప్ డ్రామా ‘స్పిరిట్’. నాలుగేళ్లుగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రాలేదు. ‘యానిమల్’ తర్వాత షూటింగ్ మొదలవుతుందని ప్రకటించినప్పటికీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది.
గత ఏడాది నుంచి ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’ స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. సందీప్-ప్రభాస్ కాంబో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఈ ఆలస్యం నిరాశకు గురిచేస్తోంది.
అయితే, తాజాగా ఆ సినిమాపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. హైదరాబాద్‌లో జరిగిన ‘జిగిరి’ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నుంచి ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు వంగా. అయితే, హను రాఘవపూడి దర్శకత్వంలో వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. ఇక, ‘ది రాజాసాబ్’ షూటింగ్ దాదాపు పూర్తయినా, ‘స్పిరిట్’కు డేట్స్ ఇవ్వాలంటే ప్రభాస్ రెండు చిత్రాలకు రెండు డిఫరెంట్ లుక్స్ మేనేజ్ చేయాలి.
Spirit
‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర ఇప్పటివరకు చేసినవాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనికి తగ్గట్టు మానసికంగా, శారీరకంగా కూడా సిద్దం కావాలి. అందుకే సందీప్ చేసిన ప్రకటన నిజమవుతుందా? లేదా? అనేది ప్రస్తుతానికి చెప్పలేం. ఇప్పుడు షూటింగ్ మొదలుకాకపోతే వచ్చే ఏడాది వరకు స్పిరిట్ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే మరి.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చేసిన ‘స్పిరిట్’ సౌండ్ లాంచ్ భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ ఎక్స్‌ప్లోసివ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.