ఆఫర్ల కోసం దర్శక, నిర్మాతల్ని బ్రతిమిలాడే వ్యక్తిత్వం కాదు: పాయల్ రాజ్‌పుత్‌

| Edited By:

Oct 07, 2019 | 11:41 AM

‘ఆఫర్ల కోసం దర్శక, నిర్మాతల్ని బ్రతిమిలాడే వ్యక్తిత్వం కాదు నాది’ అంటున్నారు పాయల్ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో కెరీర్‌ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ఆమె. ఈ చిత్రం విజయంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. తేజూస్‌ కంచర్ల కథానాయకుడు. శంకర్‌ భాను దర్శకత్వం వహించారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అక్టోబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు […]

ఆఫర్ల కోసం దర్శక, నిర్మాతల్ని బ్రతిమిలాడే వ్యక్తిత్వం కాదు: పాయల్ రాజ్‌పుత్‌
Follow us on

‘ఆఫర్ల కోసం దర్శక, నిర్మాతల్ని బ్రతిమిలాడే వ్యక్తిత్వం కాదు నాది’ అంటున్నారు పాయల్ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో కెరీర్‌ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ఆమె. ఈ చిత్రం విజయంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. తేజూస్‌ కంచర్ల కథానాయకుడు. శంకర్‌ భాను దర్శకత్వం వహించారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అక్టోబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా పాయల్‌ మీడియాతో మాట్లాడుతూ…

‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఓ రాణిలా చూశారు. ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ నా రెండో సినిమా. దాదాపు ఏడాది విరామం తర్వాత నా సినిమా రాబోతోంది. నిజంగా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమా కథ బలంగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా నచ్చింది. మీరు టీజర్‌లో చూసిన రొమాంటిక్‌ సీన్లు, ముద్దులు కేవలం కథలో భాగం మాత్రమే. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. లవ్‌, యాక్షన్‌.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం కోసం తొలిసారి యాక్షన్‌ సీన్‌లో చేశా. నాకు గాయం కూడా అయ్యింది. ఇంకా ఆ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఇందులో నేను అలివేలు అనే సామాజిక కార్యకర్త పాత్రలో నటించా. ఈ సినిమా కోసం పాపికొండల్లో 40 రోజులు ఉన్నాను.

నేను దిల్లీలో పుట్టా, ముంబయిలో ఉంటున్నా. అన్నీ సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా పెరిగా. కానీ పాపికొండల్లో ఉన్న 40 రోజులు చాలా కష్టపడ్డా. హోటల్‌లో ఏసీ పెట్టారు, గదిలోనే కప్పలు తిరిగేవి (నవ్వుతూ), చాలా భయపడ్డా. ఈ 40 రోజులు తక్కువ ఫుడ్‌ తీసుకున్నా. రోజూ రాత్రి అర్ధ లీటరు పాలు తాగేదాన్ని. ఓ విధంగా కష్టంగా ఉన్నా.. మరో విధంగా ఎంజాయ్‌ చేశా.

నేను పుట్టి పెరిగింది దిల్లీలోనే. అక్కడే నా చదువులు పూర్తయ్యాయి. మాది పెద్ద కుటుంబం. నా తల్లిదండ్రులు టీచర్లు. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు. గత మూడేళ్లుగా అతడు కనిపించడంలేదు. అతడి మానసిక పరిస్థితి బాగోలేదు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం, అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏదీ వర్క్‌ కాలేదు. అతడు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం.

‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం సెప్టెంబరులో సంతకం చేశా. ఆపై జనవరిలో షూటింగ్‌ మొదలైంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు నేను ఐదు సినిమాల్లో నటిస్తున్నా. ‘వెంకీమామా’, ‘డిస్కోరాజా’తోపాటు ఓ సినిమాలో పోలీసు అధికారిణిగా నటిస్తున్నా. మరో రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నా. కాలేజీ తర్వాత సీరియల్స్‌తో నటిగా నా కెరీర్‌ ప్రారంభమైంది. నేను మూడు చక్కటి సీరియల్స్‌లో నటించా. దాని తర్వాత ఓ పంజాబీ చిత్రంలో చేశా. మరాఠీ హిట్‌ ‘సైరాట్‌’కు పంజాబీ రీమేక్‌ అది. దీనికి నాకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. ఆపై దక్షిణాదిలో అవకాశాల కోసం ఆరేళ్లపాటు చాలా ఆడిషన్స్‌ ఇచ్చా. తెలుగు, తమిళం.. తదితర భాషా చిత్రాల కోసం ముంబయిలో ఆడిషన్స్‌ ఇచ్చా. అందరూ నన్ను తిరస్కరించారు. ‘సారీ.. మీరు సరిపోరు’ అని ముఖంపైనే చెప్పేవారు. కాబట్టి రాత్రికి రాత్రే వచ్చిన స్టార్‌డమ్‌ కాదిది. ఆరేళ్ల కష్టం.

నేను తెలుగులో కేవలం ఒక సినిమాలోనే నటించా. ఇప్పటికీ నన్ను ‘ఇందు’ అని పిలుస్తున్నారు (ఆర్‌ఎక్స్‌ 100లోని పాత్ర). ఎప్పటికీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటా. ఆరేళ్లు ముంబయిలో ఉంటూ సీరియల్స్‌ చేశా. నా తొలి సినిమాతోనే ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇంత ప్రేమను నేను ఎప్పుడూ చూడలేదు. దక్షిణాదిలో స్టార్స్‌ను ఫ్యాన్స్‌ నిజాయతీగా ప్రేమిస్తారు. వారి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్‌కు వెళ్లడం కన్నా ఇక్కడ ఉండటానికే ప్రాధాన్యం ఇస్తా. నాకు దక్షిణాదిలోనే సౌకర్యంగా అనిపిస్తోంది.