Ravi Teja: క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఖిలాడీ సినిమాతో మన ముందుకు వచ్చారు మాస్ మహరాజా రవితేజ (Ravi Teja). యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తన జోరును అలాగే కొనసాగించేందుకు త్వరలో ‘రామరావు ఆన్ డ్యూటీ’ (Ramarao on Duty) అంటూ రెడీ అవుతున్నారు రవితేజ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు మాస్ మహరాజా. దివ్యాన్ష కౌశిక్, రజిషా విజయన్ రవితేజతో రొమాన్స్ చేయనున్నారు. గతంలో పలు సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రవితేజ అభిమానులు, సినీ అభిమానులకు మరో కానుక అందించింది రామారావు చిత్ర బృందం. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
‘ పేరు సింపుల్‌గా ఉన్నా.. వాడు సూపర్ మ్యాన్’ అంటూ డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో రవితేజ మరోసారి అదరగొట్టాడు. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ టీజర్ మాస్ మహరాజా అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘ఆయుధం మీద ఆధారపడి నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది.. ఆయుధంలా బతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది. ‘క్రిమినల్స్ విల్ బి పనిష్డ్.. నో మ్యాటర్ వాట్ ఈవెన్ దో దేర్ ఈజ్ నో ఎవిడెన్స్( క్రిమినల్స్ శిక్షించబడాలి, ఆధారాలు లేకపోయినా’ అని రవితేజ నోటి నుంచి వచ్చిన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్‌గా ఉంది. టీజర్‌లో రవితేజ ఎనర్జీ చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, నరేశ్, జాన్ విజయ్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, సురేఖా వాణి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.