RGV Konda Trailer: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరక్కించడంలో తనకు తానే సాటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సమాజంలో సంచలనం సృష్టించిన అంశాలను ఇతివృత్తంగా సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. మొన్నటి వరకు ఫ్యాక్షనిజం, రాజకీయాల అంశాల చుట్టూ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు తెలంగాణ నక్సలిజం బ్యాగ్రౌండ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. వరంగల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు కొండా మురళీ, సురేఖల జీవిత కథ ఆధారంగా ‘కొండా’ అనే సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అదిత్ అరుణ్, ఐరా మోర్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్ సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం కొండా సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌లో వర్మ చూపించిన యదార్థ సంఘటనలు ఆకట్టుకుంటున్నాయి. 1990లో తెలంగాణలో జరిగిన కాల్పుల సన్నివేశంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి’ అంటూ వర్మ చెప్పే డైలాగ్ సినిమా థీమ్ మొత్తాన్ని చెప్పకనే చెబుతోంది. ట్రైలర్‌ను గమనిస్తే కొండా పాత్రను చాలా పవర్ ఫుల్‌గా చూపించినట్లు అర్థమవుతోంది.
‘క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచి పుడుతుంది’ అని కొండా పాత్ర చెబుతున్నట్లు ఉన్న కొటేషన్ ఆసక్తికరంగా ఉంది. అలాగే కొండా పాత్ర చెప్పే డైలాగ్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో వర్మ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో, ఈ సినిమాలో చూపించిన అంశాలు ఎలాంటి చర్చకు దారి తీస్తాయో చూడాలి. పూర్తి స్థాయి ఇంటెన్సివ్ యాక్షన్‌తో ఉన్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి…
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..