సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని అన్నారు. రజినీని ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం అపోలో వైద్యులు రజినీకాంత్ ఆరోగ్య సమస్యలపై పూర్తిగా దృష్టి సారించారు.
గతంలో తలైవాకు అమెరికాలో కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ వివరాల గురించి అపోలో వైద్యులు యూఎస్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. ఆ కాన్ఫరెన్స్ అనంతరం సూపర్ స్టార్ డిశ్చార్జ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, సూపర్ స్టార్ రజినీ డిసెంబర్ 25న హైబీపీ కారణంగా హైదరాబాద్‌లోని అపోలో చేరారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనడంతో అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రముఖులు ఊపిరిపీల్చుకున్నారు.