
మూవీ రివ్యూ: పిఠాపురంలో.. అలా మొదలైంది
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, కేదార్ శంకర్, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రత్యూష, శ్రీలు, రిహానా తదితరులు
ఎడిటర్: బి సత్యనారాయణ
సినిమాటోగ్రఫీ: GC క్రిష్
నిర్మాతలు: దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్, FM మురళి
దర్శకుడు: మహేష్ చంద్ర
ఒకప్పుడు ప్రేయసి రావే.. లాంటి సినిమాలు తీసిన చంద్ర మహేష్ చాలా సంవత్సరాల తర్వాత రాజేంద్రప్రసాద్ హీరోగా చేసిన సినిమా పిఠాపురంలో అలా మొదలైంది. తండ్రి కూతుర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని ఓ పల్లెటూరిలో సర్పంచ్ వీర రాఘవ (రాజేంద్ర ప్రసాద్), పంతులు విశ్వనాథం (కేదార్ శంకర్), మోతుబరి రైతు బంగారయ్య (పృథ్వీరాజ్) అత్యంత ఆప్తులు. వీళ్ల అమ్మాయిలైన అంజని (ప్రత్యూష), కీర్తన (శ్రీలు), గీత (రిహానా) కూడా ఎంతో ఆత్మీయంగా మెలిగే ప్రాణ మిత్రులు. పై చదువుల కోసం ఈ ముగ్గురు పిఠాపురం వెళ్తారు. అక్కడి క్యాంపస్ వాతావరణంలో ముగ్గురు కుర్రాళ్లకు ఆకర్షితులవుతారు. అందులో ఒకమ్మాయి గీత తన లవర్‌తో లేచిపోతుంది. మరో అమ్మాయి కీర్తన ఏకంగా గుళ్లో తాళి కట్టించుకుని ఇంటికి వచ్చేస్తుంది. వీళ్ల పరిస్థితి చూశాక, మూడో యువతి అంజని తన ప్రేమ వ్యవహారం పెద్దలకు చెప్పాలా వద్దా అనే డైలమాలో పడిపోతుంది. అసలు పెద్దలను ఎదిరించి వెళ్లిన ఆ స్నేహితురాళ్ల బతుకులు ఏ తీరానికి చేరాయి? కన్నవారిని కాదంటే బయటి ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
కథనం:
ప్రేయసి రావే లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడు చంద్ర మహేష్ తన పేరును ‘మహేష్ చంద్ర’గా మార్చుకొని చాలా గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన చిత్రమిది. ముఖ్యంగా యుక్త వయసులో పిల్లలు ఆకర్షణను ప్రేమ అనుకుని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల కన్నవారికి ఎంతటి క్షోభ మిగులుతుంది అనే సున్నితమైన అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఈ కాలం యువతకు అద్భుతమైన సందేశం ఇచ్చే ఉద్దేశం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కాలేజీ ఎపిసోడ్స్, ప్రేమ వ్యవహారాలు కాస్త రొటీన్ గానే అనిపిస్తాయి. ఆ ట్రాక్ అంతా రొటీన్ సీన్లతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇద్దరు అమ్మాయిలు ఇల్లు వదిలి వెళ్లిపోతారో.. అక్కడి నుంచి అసలు ఎమోషన్ మొదలవుతుంది. కూతుళ్ల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే నాన్నల వేదనను తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ద్వితీయార్థంలో భావోద్వేగాలు బాగా పండాయి. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ గొప్పదే అయినా, దానిని నడిపించిన స్క్రీన్ ప్లేలో ఇంకాస్త వేగం ఉంటే బాగుండేది. ఓల్డ్ ఫార్మాట్ డ్రామా తగ్గించి, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా సీన్స్ రాసుకుని ఉంటే రిజల్ట్ మరింత అద్భుతంగా ఉండేది. అయినప్పటికీ, ఒక మంచి పాయింట్‌తో తీసిన ఈ ఫ్యామిలీ డ్రామా చూసేవారిని ఆలోచింపజేస్తుంది.
నటీనటులు:
ఊరి పెద్దగా, కూతురి బాగోగులు చూసుకునే స్నేహపూర్వకమైన నాన్న పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన అనుభవాన్ని చూపించారు. చాలా కచ్చితంగా ఉండే తండ్రి క్యారెక్టర్‌లో కేదార్ శంకర్ ఒదిగిపోగా, పృథ్వీరాజ్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే బాధ్యత తీసుకున్నారు. ముగ్గురు యువతులుగా చేసిన రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ క్యారెక్టర్ల పరిధి మేరకు చక్కని అభినయం కనబరిచారు. గ్లామర్ పరంగానే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించారు.
టెక్నికల్ టీం:
సంగీతం, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తాయి. క్రిష్ కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా గోవా నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ పాటను చిత్రీకరించిన విధానం, విజువల్స్ చాలా రిచ్‌గా వచ్చాయి. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకాస్త వర్క్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు సరిపడా ఉన్నాయి కానీ, ఆర్టిస్టుల డబ్బింగ్, అలాగే వారి మేకప్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే అవుట్‌పుట్ మరింత మెరుగ్గా ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా పిఠాపురంలో అలా మొదలైంది.. లైన్ మంచిదే..!