
సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. పలు ఓటీటీల్లో కొత్త చిత్రాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అలా ఇవాళే (జనవరి 13) ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. పెద్దగా కలెక్షన్లు రాకపోయినా ఈ సినిమాలోఆడియెన్స్ ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే కథా కథనాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి పదికి 8.8 రేటింగ్ దక్కడం గమనార్హం. ఈ సినిమా కథే కొత్తగా ఉంటుంది. మర్డర్ చేయడమనేది ఆర్ట్ అని నమ్మే ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. విక్కీ లేనప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని సోదరి స్వాతిని ఎవరో రేప్ చేసి చంపుతారు. చెల్లి మరణంతో విక్కీ డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. అదే సమయంలో విక్కీ ప్రియురాలు జాను అతనిని మాములు మనిషిని చేయాలని చూస్తుంది. అదే సమయంలో నగరంలో హీరోయిన్ మాస్కులు వేసుకుని పిచ్చి రవి అనే ఓ సైకో అమ్మాయిలను చంపేస్తున్నాడని తెలుస్తుంది. అతణ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. తన ఇంట్లోనూ హీరోయిన్ మాస్క్ దొరకడంతో తన చెల్లిని కూడా ఈ కిల్లర్ చంపడేమోనని విక్కీ అనుకుంటాడు.
ఈ క్రమంలో పిచ్చి రవిని చంపాలని విక్కీ చూస్తాడు. అయితే ఆ కిల్లర్ పోలీసుల నుంచి తప్పించుకుని జాను బర్త్ డే పార్టీకి వెళ్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? అసలు స్వాతిని చంపిందెవరు? జాను బర్త్ డే పార్టీకి ఈ సైకో కిల్లర్ ఎందుకు వెళ్లాడు? చివరకు ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ తెలుగు సినిమా పేరు కిల్లర్ ఆర్టిస్ట్. రతన్ రిషి తెరకెక్కించిన ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల ప్రధాన పాత్రలో నటించింది. సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.