Chennai Love Story OTT: ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

క, కే ర్యాంప్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. జులై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మేకర్స్ చెప్పినట్లు మరీ కల్ట్ లవ్ స్టోరీ కాకపోయినా ఉన్నంతలో మంచి ప్రేమకథా చిత్రమని ప్రశంసలు అందుకుంది. ఎప్పటిలాగే హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక ముఖ్యంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో వీరి స్క్రీన్ ప్రజెన్స్, కెమిస్ట్రీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కాగా థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఈ ప్రేమ కథా చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 21 నుంచి ఓటీటీలో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ కిరణ్ అబ్బవరం సినిమా అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది.
చెన్నై లవ్ స్టోరీ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ లు సంయుక్తంగా నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు త్రిగుణ్, దేవీ ప్రసాద్, సిరి హన్మంతు, పి వాసు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా సక్సెస్ కావడానికి మణిశర్మ పాటలు, బీజీఎమ్ కూడా ఒక కారణం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టైటిల్ కు తగ్గట్టుగానే చెన్నై నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దర్శకుడు కావాలనుకునే ఒక అనాథ కుర్రాడు, అదే సమయంలో పీఠలమీదే పెళ్లి ఆగిపోయిన అమ్మాయి ల మధ్య స్నేహం, ప్రేమ.. ఆ తర్వాత పరిణామాలతో ఆద్యంతం ఎమోషనల్ గా ఈ సినిమా సాగుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన ఒక కొత్త రకమైన ప్రేమకథ అని ఈ సినిమాపై ప్రశంసలు వచ్చాయి. మరి థియేటర్లలో విజయం సాధించిన చెన్నై లవ్ స్టోరీ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
చెన్నై లవ్ స్టోరీ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




