Aashram Season 4 : బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. బాబీ డియోల్ సూపర్ హిట్ ‘ఆశ్రమ్’ సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాలీవుడ్‌లో బాబీ డియోల్ ఘనంగా పునరాగమనం చేయడానికి ఈ వెబ్ సిరీస్ కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ప్రకాష్ ఝా తెరకెక్కించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి. మూడు భాగాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో భాగం ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే బాబీ డియోల్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఆశ్రమ్’ నాల్గవ సీజన్ త్వరలో రానుంది. అందులో ఆయన బాబా నిరాళా పాత్రలో అద్భుతంగా నటించారు. ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ బాబీ డియోల్‌కు సరికొత్త గుర్తింపును ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో అతని పాత్రపై వివాదాలు వచ్చినా యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకున్నాడు బాబీ. ప్రకాష్ ఝా ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. మూఢనమ్మకాలు, రాజకీయాలు, డ్రగ్స్ దందా, అమ్మాయిలను బలవంతంగా లోబర్చుకోవడం వంటి అంశాలు చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. ఇందులో భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబా నిరాళాగా కనిపించి సినీ ప్రియులను ఆకట్టుకున్నారు బాబీ డియోల్.
ఆశ్రమ్ మొదటి భాగం 2020 ఆగస్టు 28న విడుదలైంది. రెండవ సీజన్ 2020 నవంబర్ 11న స్ట్రీమింగ్ కు రాగా, మూడవ సీజన్ 2022 జూన్ 3న వచ్చింది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం, బాబీ డియోల్ నటించిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ షూటింగ్ 2026 ఆగస్టు మధ్యలో ప్రారంభం కానుంది. ఈ నాలుగో సీజన్‌లో ప్రకాష్ ఝా, బాబీ డియోల్ మరోసారి కనిపించనున్నారు. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో అదితి పోహంకర్, చందన్ రాయ్ సన్యాల్ కూడా కనిపించనున్నారు. బాబీ డియోల్ మొదటి మూడు సీజన్లలోనూ ‘బాబా నిరాలా’ పాత్రను పోషించారు. నివేదికల ప్రకారం, బాబీ మూడవ సీజన్ కోసం 1 నుంచి 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఈ పారితోషికం చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ కారణంగానే బాబీ డియోల్ కు గ్రాండ్ రీఎంట్రీ లభించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




