తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథపై కోలీవుడ్‌లో ముగ్గురు దర్శకులు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ఏఎల్ విజయ్ ‘తలైవి’గా.. నిత్యామీనన్‌తో ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’గా.. రమ్యకృష్ణతో గౌతమ్ మీనన్ ‘ది క్వీన్’గా(వెబ్ సిరీస్) అమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం వీటన్నింటి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ నటిస్తోన్న జయలలిత బయోపిక్(తలైవి)కు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌లు ఇటీవల విడుదలయ్యాయి. అందులో అమ్మ పాత్రకు కంగనా అంతగా సెట్ అవ్వలేదనే కామెంట్లు చాలా వినిపించాయి. అంతేకాదు జయలలితలా కంగనా ఇచ్చిన హావభావాలు కూడా మెప్పించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయలలిత పాత్రపై స్పందించిన మలయాళ కుట్టీ నిత్యామీనన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిత్యామీనన్.. జయలలిత పాత్రకు తానే పర్‌ఫెక్ట్ అంటూ చెప్పుకొచ్చింది. తనకు, జయలలితకు చాలా సారూప్యతలు ఉన్నాయని.. ఆమెలాగే తాను కూడా ఏదైనా ముఖం మీదే చెప్పేస్తానని తెలిపింది. ఈ బయోపిక్‌లో నటించడం వలన జయలలిత గురించి ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చిందని నిత్యామీనన్ పేర్కొంది. అమ్మ పాత్ర కోసం తనను తాను తయారుచేసుకుంటానని.. ఆమెలా ఉండేందుకు వంద శాతం శ్రమిస్తానని ఈ మలయాళ కుట్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. కాగా తలైవి ఫస్ట్‌లుక్ వచ్చిన నేపథ్యంలో నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పరోక్షంగా కంగనా లుక్ గురించే నిత్యామీనన్ ఈ వ్యాఖ్యలు చేసిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తానికి ‘అమ్మ’గా ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.