
తన భార్య, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సంస్కృతిని గౌరవిస్తూ ఆయన చేసిన ఈ పని ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. పురుషులు కూడా ఇలా చేయవచ్చా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన ఆ విశేషాలేంటో చూద్దాం..
ఆయన ఒక గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్. ఆమె ప్రపంచం మెచ్చిన భారతీయ నటి. వీరిద్దరి జోడీ అంటేనే ఒక సెలబ్రేషన్. తాజాగా ఆ పాప్ సింగర్ తన భార్య నటిస్తున్న ‘ద బ్లఫ్’ సినిమాలోని ‘బ్లడీ మేరీ’ పాత్రకు గుర్తుగా ఒక కాక్టెయిల్ తయారు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అయితే, అందరి దృష్టి ఆ కాక్టెయిల్ మీద కంటే ఆయన మణికట్టుపై ఉన్న ఒక నల్లపూసల గొలుసు మీదకు వెళ్లింది. హిందూ సంప్రదాయంలో కేవలం మహిళలు మాత్రమే ధరించే మంగళసూత్రాన్ని ఆయన బ్రాస్‌లెట్ రూపంలో ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పాప్ స్టార్ మరెవరో కాదు.. నిక్ జోనస్.
Nick Jonas
సాధారణంగా మంగళసూత్రం అంటే వివాహితలకు చిహ్నం. నల్లపూసలు, బంగారు సూత్రాలతో ఉండే ఈ పవిత్ర బంధం ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో సోనమ్ కపూర్ తన రాశి చక్రంతో కూడిన మంగళసూత్రాన్ని ఎంచుకోగా, ఆలియా భట్ తన హారంలో ఇన్ఫినిటీ గుర్తును చేర్చుకుంది. రాధికా మర్చంట్ సైతం తన మంగళసూత్రాన్ని బ్రాస్‌లెట్‌గా ధరించి ఆశ్చర్యపరిచింది. అయితే, ఇప్పుడు నిక్ జోనస్ దానిని ధరించడం ద్వారా ఒక సరికొత్త చర్చకు తెరలేపారు.
పెళ్లయిన వస్తువులను, గుర్తులను కేవలం మహిళలు మాత్రమే ధరించాలా? అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. చాలామంది పురుషులు పెళ్లి ఉంగరాలను కూడా పెట్టుకోవడానికి ఇష్టపడని ఈ రోజుల్లో, నిక్ జోనస్ తన భార్య దేశపు సంప్రదాయాన్ని తన మణికట్టుపై ధరించడం విశేషం. ఇది కేవలం స్టైల్ కోసం చేసిన ప్రయత్నం కాదు, తన భార్య నమ్మకాల పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనం. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అనే భావనను ఆయన ఈ చిన్న చర్య ద్వారా చాటిచెప్పారు.
నిక్ జోనస్ ప్రభావంతో ఇప్పుడు పురుషుల మంగళసూత్ర బ్రాస్‌లెట్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని ప్రముఖ జ్యువెలరీ డిజైనర్లు చెబుతున్నారు. చాలామంది పురుషులు ఇప్పుడు తమ సంబంధాల్లో సమానత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే ఇలాంటి ఆభరణాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని ‘డిఐ డిజైన్స్’ ఫౌండర్ దిశా షా పేర్కొన్నారు. త్వరలోనే పురుషుల కోసం ప్రత్యేకంగా మంగళసూత్ర కలెక్షన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆమె వెల్లడించారు.
లోకమంతా టెక్నాలజీ, ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. తమ మూలాలను, ఎదుటివారి సంస్కృతిని గౌరవించడమే నిజమైన ప్రేమ అని నిక్ జోనస్ నిరూపించారు. కేవలం సినిమా ప్రమోషన్ కోసం కాకుండా, మనసు నిండా ఉన్న ప్రేమతో ఆయన చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెళ్లి ఉంగరాలను ఇంట్లో మర్చిపోయే భర్తల కంటే, ఇలా భార్య సంస్కృతిని సొంతం చేసుకునే నిక్ జోనస్ లాంటి భర్తలు కావాలంటూ మహిళలు కామెంట్స్ చేస్తున్నారు.