కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. ఈ వైరస్ బారిన పడిన హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో(41) కన్నుమూశారు. కరోనాతో 90 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఈ నటుడు.. ఆదివారం తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నిక్ భార్య అమంద క్లూట్స్.. ”మరో ఏంజిల్‌ని దేవుడు స్వర్గానికి తీసుకువెళ్లాడు. నిక్ చాలా ప్రతిభావంతమైన వ్యక్తి. అతడు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. చాలా అద్భుతమైన నటుడు. సంగీతకారుడు. కుటుంబాన్ని అతడు చాలా బాగా ఇష్టపడేవారు. ఎల్విస్(కుమారుడు), నేను ప్రతీరోజు అతన్ని మిస్ అవుతూనే ఉంటాం” అని ట్వీట్ చేశారు.
అయితే మార్చి 30న ఐసీయూలో చేరిన నిక్ పరిస్థితి రోజు రోజుకు క్షీణించింది. ఆయన కుడికాలులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు ఆ కాలును సైతం తొలగించారు. రెండు సార్లు కాలేయ మార్పిడి చేసినట్లు కూడా సమాచారం. అయినా ప్రయోజం లేకపోగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ నిక్ ఆదివారం కన్నుమూశారు. కాగా బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వే, రాక్ ఆఫ్ ఏజెస్, వెయిట్రస్, ఎ బ్రాంక్స్ టేల్ వంటి పలు చిత్రాలతో పాటు బ్లూ బ్లడ్స్, లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, లిలీహ్యామర్ వంటి సిరీస్‌లోనూ కనిపించిన నిక్ మరణంపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.