
మూవీ రివ్యూ: తెలుసు కదా
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష తదితరులు
సినిమాటోగ్రాఫర్: గుణశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: తమన్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
కథ:
వరుణ్ (సిద్దు జొన్నలగడ్డ) ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. అనాధ కావడంతో తనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ కావాలని.. పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని ఆశపడతాడు. అయితే తన లైఫ్ లో అంతకుముందే రాగా (శ్రీనిధి శెట్టి) తో బ్రేకప్ అయి ఉంటుంది. అలాంటి సమయంలో అంజలి (రాశి ఖన్నా) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ అనుకోని విధంగా మళ్లీ వరుణ్ జీవితంలోకి వస్తుంది రాగ. ఆ తర్వాత ఏం జరిగింది.. ముగ్గురు జీవితాలు ఎటువైపు తిరిగాయి అనేది ఈ సినిమా కథ..
కథనం:
కొన్ని కథలు పేపర్ మీద రాసుకున్నంత ఈజీ కాదు స్క్రీన్ మీదకు తీసుకురావడం. తెలుసు కదా కూడా అలాంటి కథే. అసలు సినిమా తీయడం పక్కన పెడితే.. అసలు నీరజ కోన ఈ సినిమా నెరేషన్ ఎలా ఇచ్చి ఉంటుందా అని ఆలోచిస్తేనే వింతగా ఉంది. ముందు ఒక లవ్ స్టోరీ బ్రేకప్.. ఆ తర్వాత ఇంకో అమ్మాయితో పెళ్లి.. అక్కడి నుంచి కొత్త రిలేషన్.. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రేమించిన అమ్మాయి మళ్ళీ లైఫ్ లోకి రావడం.. అక్కడి నుంచి ముగ్గురు ఒకే ఇంట్లో ఉండి రిలేషన్ కంటిన్యూ చేయడం.. ఇవన్నీ వినడానికి కూడా చాలా దారుణంగా అనిపిస్తాయి. కానీ అదే కథను స్క్రీన్ మీద చూపించింది నీరజ కోన. కాకపోతే ఒరిజినల్ మేకింగ్ తో తన మార్క్ చూపించింది నీరజ. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను అడ్వాన్స్డ్ వర్షన్ తో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా అలాంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడింది నీరజ. ఫస్టాఫ్ వరకు బాగానే వెళ్ళింది.. సెకండాఫ్ మాత్రం తడబడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.. మరికొన్ని కన్ఫ్యూజింగ్..! సెకండ్ హాఫ్ లో హర్ష, సిద్దు మధ్య వచ్చే అబ్బాయిల బాధ అమ్మాయిలతో చెప్పుకోవద్దు అనే ఒక సీన్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. విభిన్నమైన సినిమా చూడాలి అనుకునే వాళ్లకు ఇది నచ్చే అవకాశం లేకపోలేదు.
నటీనటులు:
సిద్దు జొన్నలగడ్డ చాలా బాగా నటించాడు.. ఈ తరహా క్యారెక్టర్ పుల్ చేయడం అంత ఈజీ కాదు. రాశి కన్నా, శ్రీనిధి శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. వైవా హర్ష క్యారెక్టర్ చాలా బాగుంది. మిగిలిన వాళ్ళందరూ ఓకే.
టెక్నికల్ టీం:
తమన్ మాత్రం ఓజి నుంచి బయటికి రాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అదే కొట్టాడు. ఎడిటర్ నవీన్ నూలి వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ నీరజ కోన ఐడియా కొత్తగా ఉంది.. ఎగ్జిక్యూషన్ ఇంకాస్త పర్ఫెక్ట్ గా ఉండుంటే బాగుండేది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా తెలుసు కదా.. కొంచెం క్లారిటీ.. కొంచెం కన్ఫ్యూజన్..