AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIK Movie Review: ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్టు కొట్టాడా?

కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

LIK Movie Review: 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్టు కొట్టాడా?
Love Insurance Kompany Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 4:37 PM

Share

మూవీ రివ్యూ: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, ఎస్.జె. సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

ఎడిటింగ్: ప్రదీప్ ఇ రాఘవ్

దర్శకుడు: విఘ్నేష్ శివన్

నిర్మాతలు: నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్

కథ:

2040 నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అప్పటి ప్రపంచం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ అనే యాప్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు విడిపోవాలి అనేది ఆ యాప్ మాత్రమే నిర్ణయిస్తుంది. ధీమా (కృతి శెట్టి) ఈ యాప్ ఇచ్చే సూచనలను గుడ్డిగా ఫాలో అవుతుంటుంది. మరోవైపు అసలు మొబైల్ ఫోన్లు అనేవే లేని ఆర్గానిక్ వరల్డ్ నుంచి వచ్చిన వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్) ఆ యాప్‌కు వాయిస్ ఓవర్ ఇస్తుంటాడు. అతడు ధీమాను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు, కానీ యాప్‌లోని లవ్ స్కోర్ ఫీచర్ వల్ల వాళ్ల బంధంలో సమస్యలు వస్తాయి. యాప్ చెప్పిందే వేదంగా నమ్మే ధీమా.. వాసును వదిలేసి వెళ్లిపోతుంది. ప్రేమను ఒక డిజిటల్ యాప్ కొలవలేదని నిరూపించడానికి వాసు ఏం చేశాడు? వీళ్ళ మధ్యలోకి సూర్య (ఎస్‌జే సూర్య) ఎందుకొచ్చాడు..? ఆ సిస్టమ్‌ను ఎదిరించి వాసు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ.

కథనం:

టెక్నాలజీతో ముడిపడి ఉన్న భవిష్యత్తులో ప్రేమ అనే కాన్సెప్ట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ, దర్శకుడు దాన్ని పైపైన మాత్రమే టచ్ చేశాడు తప్ప, డెప్త్‌లోకి వెళ్లలేదు. పేపర్ మీద అద్భుతంగా అనిపించే కొన్ని కథలు, స్క్రీన్ మీదకు వచ్చేసరికి తేలిపోతాయి. ఈ సినిమా కూడా సరిగ్గా అదే కోవలోకి వస్తుంది. 2040 నాటి ఫ్యూచరిస్టిక్ సెటప్ ప్రస్తుత సమాజానికే అద్దం పట్టినట్లు ఉంటుంది కానీ, భవిష్యత్తును చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. అలాగే ఆర్గానిక్ వరల్డ్ అనే కాన్సెప్ట్ కూడా కృత్రిమంగా అనిపిస్తుందే తప్ప కన్విన్సింగ్‌గా లేదు. లీడ్ పెయిర్ మధ్య ఎమోషనల్ కనెక్షన్, సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల కథనం వీక్ అయిపోయింది. ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ఎమోషనల్ డెప్త్ చాలా అవసరం.. అది ఈ సినిమాలో కాస్త లోపించింది. యోగి బాబు లాంటి కమెడియన్ ఉన్నా, కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఒక్క బలమైన సన్నివేశం కూడా లేకపోవడం, ఫీల్ గుడ్ ఎమోషన్స్ మిస్ అవ్వడం కథనంలోని అతిపెద్ద లోపం. కాకపోతే ఐడియా పరంగా మాత్రం విఘ్నేష్ శివన్ మ్యాజిక్ చేసాడు. అలాంటి థాట్ నుంచి సినిమా కథ రాసుకోవడం చిన్న విషయం కాదు. అది స్క్రీన్ మీద అదే రేంజ్‌లో వర్కవుట్ అయ్యుంటే ట్రెండ్ సెట్టర్ అయ్యుండేది LIK సినిమా.

నటీనటులు:

ప్రదీప్ రంగనాథన్ తన పాత్రకు తగ్గట్లుగా నటించాడు. తన గత చిత్రాల్లో ఉన్నంత ఎనర్జీ, ఛార్మ్ ఇందులో కనిపించవు. ఆ పాత్ర అలాంటిది. కృతి శెట్టి ఈ పాత్రకు సెట్ కాలేదనిపిస్తుంది. పైగా ఆమె నటనకు స్కోప్ ఇచ్చేంత డెప్త్ స్క్రిప్ట్‌లో లేదు. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా ఆకట్టుకునేది ఎస్.జె. సూర్య మాత్రమే. తన ఎంటర్టైనింగ్ విలనిజంతో సినిమాకు కొంత ఎనర్జీ తీసుకొచ్చాడు. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అక్కడక్కడా కనిపించినా.. కథపై పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు.

టెక్నికల్ టీం:

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ పెద్దగా ఎక్కలేదు. పాటలు గుర్తుంచుకునేలా లేవు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలోనూ బాగా ల్యాగ్ ఉంది. చాలా సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపించినా, 2040 ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని పూర్తిగా నమ్మించేలా చూపించలేకపోయారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేయలేకపోయింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా LIK.. నైస్ కాన్సెప్ట్.. వీక్ ఎగ్జిక్యూషన్..!

Follow Us