AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రినే డెడ్‌బాడీగా మార్చి గేమ్.. ఏడేళ్ల బుడ్డోడి క్రేజీ హాబీ వైరల్!

Funeral Obsession: చిన్నపిల్లలకు బొమ్మలంటే ఇష్టం.. ఆటలంటే సరదా.. కానీ ఈ ఏడేళ్ల బాలుడికి మాత్రం శవపేటికలు, పూలదండలు, అంత్యక్రియలంటే మహా ఇష్టం! అంతటితో ఆగకుండా తండ్రినే శవంగా పడుకోబెట్టి ఇంట్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. చిన్న చిన్న శవపేటికలు తయారు చేయడం, సంతాప గీతాలు పాడటం, చనిపోయిన వ్యక్తి ముందు ఏడుస్తున్నట్లు నటించడం.. ఇలా నిజమైన అంత్యక్రియల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అచ్చం అలాగే అనుకరిస్తున్నాడు. ఈ బాలుడి వింత హాబీకి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

తండ్రినే డెడ్‌బాడీగా మార్చి గేమ్.. ఏడేళ్ల బుడ్డోడి క్రేజీ హాబీ వైరల్!
7 Year Old Boys Bizarre Coffin Obsession Turns Dad Into A Dead Body In Mock Funeral
Sharada V
|

Updated on: Nov 18, 2026 | 5:42 PM

Share

Funeral Obsession: చిన్నపిల్లలకు బొమ్మలంటే ఇష్టం.. ఆటలంటే సరదా.. కానీ ఈ ఏడేళ్ల బాలుడికి మాత్రం శవపేటికలు, పూలదండలు, అంత్యక్రియలంటే మహా ఇష్టం! అంతటితో ఆగకుండా తండ్రినే శవంగా పడుకోబెట్టి ఇంట్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. చిన్న చిన్న శవపేటికలు తయారు చేయడం, సంతాప గీతాలు పాడటం, చనిపోయిన వ్యక్తి ముందు ఏడుస్తున్నట్లు నటించడం.. ఇలా నిజమైన అంత్యక్రియల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అచ్చం అలాగే అనుకరిస్తున్నాడు. ఈ బాలుడి వింత హాబీకి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

పిల్లల ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్లకు ఏది నచ్చుతుందో, దేనిపై ఆసక్తి పెంచుకుంటారో ఒక్కోసారి పెద్దలకు కూడా అర్థం కాదు. కొందరు బొమ్మలతో ఆడుకుంటే.. మరికొందరు కార్లు, విమానాల బొమ్మలు సేకరిస్తుంటారు. కానీ చైనాకు చెందిన ఓ ఏడేళ్ల బాలుడి అభిరుచి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడికి అంత్యక్రియలంటే ఎంతో ఆసక్తి. ఇంట్లోనే చిన్నపాటి వేడుక నిర్వహిస్తుంటాడు. విచిత్రమేంటంటే అందులో అతడి తండ్రే ప్రధాన పాత్రధారి!

చైనాలోని వాంగ్ అనే ఏడేళ్ల బాలుడు ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. అతడి తల్లి మా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల ద్వారా ఈ వింత అభిరుచి వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరినప్పుడు వాంగ్ తన ఆట మొదలుపెడతాడు. తండ్రిని చనిపోయిన వ్యక్తిగా పడుకోబెట్టి, తాను అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తిగా మారిపోతాడు. ఇక ఇంట్లో ఉన్నవారంతా అతడి కార్యక్రమానికి సహకరించాల్సిందే!

శవపేటికల తయారీ నుంచి సంతాప గీతాల వరకు.. అన్నీ తనే!

వాంగ్ కేవలం తండ్రిని పడుకోబెట్టి అంత్యక్రియలు చేస్తున్నట్లు నటించడం మాత్రమే కాదు. ఇందుకోసం అవసరమైన వస్తువులను కూడా స్వయంగా తయారు చేసుకుంటాడు. కాగితాలతో చిన్న చిన్న శవపేటికలు, పూలదండలు, పేపర్ పగోడాలు, జంతువుల ఆకారంలో నైవేద్య వస్తువులు తయారు చేస్తుంటాడు. అంతేకాదు.. లెగో బొమ్మలతో అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా టెంట్లు కూడా నిర్మిస్తాడు. అంత్యక్రియలు ప్రారంభమయ్యాక వాంగ్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. సంతాప మంత్రాలు చదువుతాడు. చనిపోయిన వ్యక్తి ముందు కూర్చుని ఏడుస్తున్నట్లు నటిస్తాడు. వాతావరణం మరింత గంభీరంగా ఉండేందుకు తన తల్లిదండ్రుల ఫోన్‌లో అంత్యక్రియలకు సంబంధించిన సంగీతాన్ని కూడా ప్లే చేస్తాడు. ఇలా ఒక్కో కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంటాడు. అతడి తండ్రి కూడా కొడుకు ఆటలో భాగంగా మృతుడి పాత్ర పోషిస్తుండటం విశేషం.

నాలుగేళ్ల వయసులో అంత్యక్రియలకు వెళ్లడంతో మొదలైన ఆసక్తి!

వాంగ్‌ నాలుగేళ్ల వయసులో ఓ అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చూసిన ఆచారాలు, సంప్రదాయాలు అతడిని ఎంతగానో ఆకర్షించాయి. అప్పటి నుంచి వాటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కిండర్ గార్టెన్‌లో చదువుతున్న సమయంలో ఓ టీచర్ చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వాంగ్ తన స్కెచ్‌బుక్ మొత్తం అంత్యక్రియల్లో ఉపయోగించే పూలదండల బొమ్మలతో నింపేశాడని టీచర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి ఆసక్తి ఎంతగా ఉందో కుటుంబ సభ్యులకు అర్థమైంది.

కొడుకు వింత హాబీని చూసి భయపడని తల్లిదండ్రులు!

సాధారణంగా ఇలాంటి విషయాలు చూస్తే తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కానీ వాంగ్ తల్లిదండ్రులు మాత్రం అతడిని అడ్డుకోలేదు. ప్రతి చిన్నారికి ఒక్కో రకమైన ఆసక్తి ఉంటుందని, తమ కొడుకు అభిరుచి మాత్రమే కాస్త భిన్నంగా ఉందని భావించారు. ‘ప్రతి పిల్లవాడికి ఒక్కో హాబీ ఉంటుంది. మా అబ్బాయికి ఉన్నది కాస్త భిన్నమైన హాబీ అంతే’ అని తల్లి మా తెలిపింది. అతడి తాతయ్య, అమ్మమ్మ కూడా ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందడం లేదని అంది. వాంగ్‌కు ఈ సంప్రదాయాలను తల్లిదండ్రులే నేర్పించారనే ప్రచారం రావడం కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే తాము అతడికి ఈ విషయాలు నేర్పించలేదని బాలుడితోనే చెప్పించారట. ఆన్‌లైన్‌లో వీడియోలు, ట్యుటోరియల్స్ చూసి అంత్యక్రియలకు సంబంధించిన అనేక విషయాలను తనంతట తానే నేర్చుకున్నాడని తల్లి తెలిపింది.

భవిష్యత్తులో ఇదే వృత్తిని ఎంచుకుంటాడేమో

ఇక వాంగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కొందరు బాలుడి ఆసక్తిని చూసి ఆశ్చర్యపోతుంటే మరికొందరు భవిష్యత్తులో అంత్యక్రియల నిర్వహణ రంగంలో గొప్ప నిపుణుడు అవుతాడేమోనని జోకులు వేస్తున్నారు. ఇంకొందరు అతడి తల్లిదండ్రులు కొడుకు ఆసక్తిని అర్థం చేసుకుంటూ ప్రోత్సహిస్తున్న తీరును అభినందిస్తున్నారు. మరికొందరు చైనా ప్రాచీన తత్వవేత్త కన్ఫ్యూషియస్‌ను గుర్తు చేస్తున్నారు. చారిత్రక కథనాల ప్రకారం.. కన్ఫ్యూషియస్ కూడా చిన్నతనంలో అంత్యక్రియల ఆచారాలను అనుకరించేందుకు ఆసక్తి చూపేవాడని పోలుస్తున్నారు. ఈ ఏడేళ్ల బాలుడి వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. చిన్నపిల్లల ఆసక్తులు ఎంత భిన్నంగా ఉంటాయో చెప్పడానికి ఈ బాలుడి కథ ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us