Hanuman Ansh: హనుమాన్ అంశ్ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం మెప్పించిందా..?
గత 50 రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న హనుమాన్ అంశ్ సినిమా తెలుగులో విడుదలైంది. 2 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఎలా ఉంది..? అసలంతగా ఈ సినిమాలో ఏముందో పూర్తి రివ్యూలో చూద్దాం ..

మూవీ రివ్యూ: హనుమాన్ అంశ్
నటీనటులు: శోభినవ్ సత్య, చందన్ కె ఆనంద్, అనిల్ రత్సోగి, నిఖిల్ దూబే, నేహా పరాంజ్‌పే తదితరులు
సినిమాటోగ్రఫీ: విశాల్ బావా
ఎడిటింగ్: శంఖ్ రాజ్యాధ్యక్ష
సంగీతం: సాధు సుశీల్ తివారీ
నిర్మాత: రాగిని సోనా, నమ్రత సింగ్, విశాల్ చతుర్వేది, అనుప్రియ A నాగర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: విశాల్ చతుర్వేది
కథ:
1914వ సంవత్సరంలో 13 వయసున్న లక్ష్మీనారాయణ్ శర్మ ( శోభినవ్ సత్య) అనే కుర్రాడు తన కన్నతల్లి చనిపోవడం, తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. తల్లి మీద బెంగతో ఇంటి నుంచి పారిపోతాడు. హనుమంతుడిని భక్తితో పూజించడం ద్వారా శ్రీరాముడికి దగ్గరవ్వచ్చని, తద్వారా దేవుడి దగ్గరున్న తన తల్లిని మళ్లీ కలుసుకోవచ్చని బలంగా నమ్ముతాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన ఆ బాలుడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? లక్ష్మీనారాయణ్ శర్మ భవిష్యత్తులో నీమ్ కరోలీ బాబాగా ఎలా మారాడు? ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? దైవ భక్తి ద్వారా తన తల్లిని నిజంగానే కలుసుకున్నాడా లేదా? అన్నదే ఈ సినిమా ప్రధానాంశం.
కథనం:
కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి హిందీలో ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా రూపొందింది. సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా తన తల్లిని కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో దేవుడి కోసం అతను పడే తపన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. వెనుకబడిన వర్గాల పిల్లలకు తన భోజనాన్ని పంచే సన్నివేశం, నాస్తికుడిలో మార్పు తెచ్చే సీన్, అలాగే రాజ్‌కోట్ గుడిలో జరిగే ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. శ్రీరాముడి గొప్పదనం గురించి చెప్పే డైలాగ్స్ కూడా మనసుకు హత్తుకుంటాయి. విరామం వరకు సినిమా చాలా పర్ఫెక్ట్ గా, ఒక దైవిక భావన కలిగించేలా ముందుకు వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు అసలు విషయాన్ని పక్కనపెట్టి బాబా మహిమలను హైలైట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమాకు వెళ్తే కచ్చితంగా ఏదో గుళ్లో కూర్చున్నట్లు నాలుగు వైపులా రామ్ రామ్ అని వినిపిస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణ్ నీమ్ కరోలీ బాబాగా మారాక రాళ్లను స్వీట్స్ గా మార్చడం, మాయం చేసి రైలు టికెట్లు తెప్పించడం, ఆగిపోయిన రైలును తన మహిమతో కదిలించడం, జైలు తాళాలు వాటంతట అవే తెరుచుకోవడం లాంటి వింతలు వరుసగా వస్తుంటాయి. దేవుడి భక్తి కంటే ఒక వ్యక్తిని ఎక్కువగా కీర్తించడం లాంటివి సామాన్య ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక గురువులను, వాళ్ల మహిమలను బలంగా నమ్మే వాళ్లకు ఈ ద్వితీయార్థం బాగా నచ్చుతుంది. కానీ లాజిక్స్ వెతికే వాళ్లకు మాత్రం ఈ మహిమలన్నీ కాస్త అతిగా అనిపిస్తాయి. ఒకవేళ ఆ మ్యాజిక్స్ తగ్గించి, ఎమోషన్స్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. ఉత్తర భారతదేశంలో బాబాకు ఉన్న విపరీతమైన భక్తుల వల్లే ఈ సినిమా అక్కడ అంత పెద్ద విజయం సాధించింది. ఇక తెలుగు హక్కులను హోంబలే ఫిల్మ్స్ లాంటి పెద్ద సంస్థ తీసుకుని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఓవరాల్ గా చూసుకుంటే భక్తి, ఆధ్యాత్మికతను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
నటీనటులు:
నీమ్ కరోలీ బాబా పాత్రలో నటించిన శోభినవ్ సత్య నటన ఈ సినిమాకు అతిపెద్ద బలం. అచ్చం నిజమైన బాబాలానే ఆయన హావభావాలు, నడక, ఆ చిరునవ్వు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. తెరపై ఆ క్యారెక్టర్‌ను చాలా సహజంగా పండించాడు. బాబాకు ముఖ్య భక్తుడైన భగవన్‌దాస్ పటేల్ పాత్ర చేసిన నటుడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది, దాన్ని అతను 100 శాతం వాడుకున్నాడు. డాక్టర్ రామ్ నందన్ క్యారెక్టర్‌లో చందన్ కె ఆనంద్ తన పరిధి మేర బాగానే నటించాడు. సినిమాలో ఉన్న మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
సాధు సుశీల్ తివారీ అందించిన సంగీతం కథకు చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా రామ, శివ, హనుమాన్ మంత్రాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా చూసి బయటకు వచ్చాక కూడా మనకు గుర్తుండిపోతుంది. శంఖ్ రాజ్యాధ్యక్ష ఎడిటింగ్ నీట్ గా ఉంది. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ కూడా చాలా నాచురల్ గా సెట్ అయ్యాయి. విశాల్ బావా సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీయడం వల్ల విజువల్స్ లో రిచ్ నెస్ లేకపోవడం స్క్రీన్ మీద కొన్ని చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా హనుమాన్ అంశ్.. మంచి సినిమా..!
