భారీ ఎలుగుబంటి కోసం అధికారుల వేట.. చివరకు ట్విస్ట్!
Russia Bear Panic: ఒక్క ఫొటో.. ఊరంతా గందరగోళం.. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ అధికారులు! ఎక్కడ చూసినా ఆ ఎలుగుబంటి గురించే చర్చ. గ్రామంలో భారీ ఎలుగుబంటి తిరుగుతోందన్న సమాచారంతో అధికారులు హుటాహుటిన గాలింపు చేపట్టారు.. చివరకు అసలు విషయం తెలిసి అధికారులు అవాక్కయ్యారు.

Bear Attack: రష్యాలోని అముర్ ప్రాంతంలో ఓ భారీ గోధుమ రంగు ఎలుగుబంటి గ్రామంలోని రోడ్డుపై నడుస్తున్న ఫొటో గ్రామస్థులను విపరీతంగా భయపెట్టింది. ఫొటో చూస్తే నిజంగానే ఎలుగుబంటి వీధిలోకి వచ్చినట్లుగా ఉంది. మొదట ఓ మహిళ ఫొటోను తన స్నేహితురాలికి పంపించింది. అయితే ఆ ఫొటో అక్కడితో ఆగలేదు. మెసేజింగ్ యాప్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి చేరింది. దాన్ని చూసిన స్థానికులు ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చిందని నమ్మారు. దీంతో భయపడిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక్క ఫొటోతో క్షణాల్లో గ్రామమంతా కలకలం రేగింది.
ఎలుగుబంటి కోసం అధికారుల వేట.. చివరకు అసలు ట్విస్ట్!
గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తోందన్న ఫిర్యాదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి ఎక్కడ దాక్కుంది? ఎటువైపు వెళ్లింది? తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎక్కడా ఎలుగుబంటి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. ఫొటో వెనుక అసలు నిజం బయటపడింది. ChatGPTతో సృష్టించిన AI చిత్రం అని తేలింది.
మహిళకు రూ.16 వేల ఫైన్!
ఈ వ్యవహారం ముదరడంతో సదరు మహిళే పోలీసులను సంప్రదించింది. ఆ ఫొటోను తానే ChatGPTతో తయారు చేశానని, మొదట సరదా కోసం స్నేహితురాలికి పంపించానని అంగీకరించింది. అయితే అప్పటికే ఆ నకిలీ చిత్రం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడంతో పాటు అధికారుల సమయాన్ని కూడా వృథా చేసింది. విచారణ జరిపిన అముర్ ప్రాంతీయ కోర్టు ఆమెకు 15,000 రూబుళ్ల జరిమానా విధించింది. భారత కరెన్సీలో దాదాపు రూ. 16 వేలు. ఫేక్ ఫొటో సృష్టించినందుకు చివరకు ఆమె జేబుకు చిల్లు పడింది. ఇదే తరహాలో రష్యాలోని తూర్పు ట్రాన్స్‌బైకాల్ ప్రాంతంలో మరో ఘటన జరిగింది. ఓ గ్రామంలో ఎలుగుబంటి ఉన్నట్లు నకిలీ ఫొటోను షేర్ చేసిన మహిళకు 30,000 రూబుళ్ల జరిమానా విధించారు.
రష్యాలో నిజంగానే ఎలుగుబంట్ల భయం
రష్యాలో నిజంగానే ఎలుగుబంట్ల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కనీసం 26 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. శీతాకాలంలో నిద్రాణ స్థితిలో ఉండే ఎలుగుబంట్లు వసంతకాలం ప్రారంభమైన తర్వాత ఆహారం కోసం బయటకు వస్తాయి. జనావాసాల్లోకి చొరబడటంతో మనుషులతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఎలుగుబంట్ల సంఖ్య పెరగడం, పైన్ గింజలు, బెర్రీల దిగుబడి తగ్గడం వల్ల అవి ఆహారం కోసం గ్రామాల వైపు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో రష్యాలో గోధుమ రంగు ఎలుగుబంట్ల సంఖ్య రెండింతలకు పైగా పెరిగి సుమారు 3.08 లక్షలకు చేరినట్లు అంచనా. శీతాకాల ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా భావిస్తున్నారు. ఎలుగుబంట్లను నియంత్రించేందుకు రష్యా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 3,440కి పైగా ప్రమాదకర ఎలుగుబంట్లను చంపినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
ఒక్క క్లిక్‌తో ఫేక్ ఫొటో.. కానీ పరిణామాలు మాత్రం నిజం!
AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిజమైన ఫొటోల మాదిరిగా కనిపించే నకిలీ చిత్రాలను తయారు చేయడం చాలా సులభమైంది. అయితే అలాంటి చిత్రాలను నిజమని నమ్మి షేర్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. ముఖ్యంగా జంతువుల దాడులు, ప్రమాదాలు, విపత్తులకు సంబంధించిన నకిలీ ఫొటోలు ప్రజల్లో భయాన్ని సృష్టించడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి తీసుకొస్తాయి. AIతో ఏదైనా సృష్టించడం ఎంత సులభమో దాన్ని బాధ్యతగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన గుర్తుచేస్తోంది.