AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaayapadda Simham Movie : గాయపడ్డ సింహం సినిమా రివ్యూ.. ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడా..?

యంగ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం గాయపడ్డ సింహం. ఇందులో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది.

Gaayapadda Simham Movie : గాయపడ్డ సింహం సినిమా రివ్యూ.. ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడా..?
Gaayapadda Simham Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 01, 2026 | 4:14 PM

Share

మూవీ రివ్యూ: గాయపడ్డ సింహం

నటీనటులు : శ్రీవిష్ణు, తరుణ్ భాస్కర్, జె. డి. చక్రవర్తి, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు..

దర్శకుడు: కశ్యప్ శ్రీనివాస్

నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్

సంగీతం: స్వీకర్ అగస్తీ

సినిమాటోగ్రఫర్: విద్యాసాగర్ చింత

ఎడిటర్: విప్లవ్ నైషధం

కథ:

దరహాస్ (తరుణ్ భాస్కర్), గాయత్రి (మానస చౌదరి) ప్రేమించుకుంటారు.. అయితే వీళ్ళ ప్రేమకు గాయత్రి తండ్రి (అవినాష్ కురివిల్లా) ఒక షరతు విధిస్తాడు. ఆ షరతు కారణంగా దరహాస్ అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా ప్రయాణం కోసం దరహాస్ చేసే ప్రయత్నాలు అనూహ్యంగా విఫలమవుతాయి. అక్కడికి వెళ్లిన వెంటనే డిపోర్ట్ చేస్తారు. ఆ ఆటంకాల వెనుక ఉన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలే అని తెలుసుకుంటాడు దరహాస్. తన లక్ష్యాన్ని చెడగొట్టిన ట్రంప్‌పై దరహాస్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ మొత్తం వ్యవహారంలో షాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా ప్రవేశించింది? ఇందులో పోలీసుల పాత్ర ఏంటి? అసలు బ్రూటల్ ధర్మ (జె. డి. చక్రవర్తి) నేపథ్యం ఏమిటి? వీటన్నింటికీ సమాధానమే ఈ చిత్ర ఇతివృత్తం.

కథనం :

దర్శకుడు ఎంచుకున్న కథాంశం చాలా సింపుల్ అయినప్పటికీ.. దానిని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది.. స్క్రీన్ ప్లే ఫాస్టుగా ఉండటంతో గాయపడ్డ సింహం పర్లేదు అనిపిస్తుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించింది. ముఖ్యంగా సినిమాలో హాస్యానికి పెద్ద పీట వేశారు. ట్రంప్ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు, అలాగే శ్రీవిష్ణు కుటుంబ నేపథ్యంలో వచ్చే డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించడంలో దర్శకుడు నూరు శాతం సఫలమయ్యాడు. అయితే ఒక పక్క కొన్ని పాత్రలు, వాటి ట్రాక్‌లు ఎంతో అద్భుతంగా రాసుకున్నప్పటికీ.. కథను ముందుకు నడిపించే ఇతర కీలక సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్స్ విషయంలో ఆశించిన స్థాయిలో పట్టు కనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం అలా సాగిపోతుందే తప్ప, ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూసేలా కథనంలో వేగం గానీ, సరైన టెంపో గానీ లోపించాయి. అదొక్కటే ఈ సినిమాకు మైనస్. ప్రధాన పాత్ర అయిన దరహాస్‌కు, ఇతర కీలక వ్యక్తులకు మధ్య రాసుకున్న సీరియస్ రైటింగ్ ఇంకాస్త బలంగా ఉండి ఉంటే, కథనం మరింత రక్తికట్టేది. కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసిన భావన కలుగుతుంది. రెగ్యులర్‌గా అనిపించే సీన్స్ కాకుండా, స్క్రీన్ ప్లేలో కొన్ని ఊహించని మలుపులు రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్స్ వల్ల కథనం నెట్టుకొచ్చేసింది. కేవలం వినోదం మాత్రమే కాపాడిన ఈ స్క్రీన్ ప్లేలో.. ఎమోషన్స్‌కు ఇంకాస్త స్పేస్ ఇచ్చుంటే దర్శకుడికి మంచి మార్కులు పడేవి. అయినా కూడా సింపుల్ అండ్ బ్యూటీఫుల్‌గా వెళ్లిపోయింది గాయపడ్డ సింహం.

నటీనటులు :

తరుణ్ భాస్కర్ దరహాస్ పాత్రలో ఒదిగిపోయాడు. సందర్భానికి తగినట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ మారుస్తూ తనదైన శైలిలో అద్భుతమైన నటన కనబరిచాడు. శ్రీవిష్ణు తన విలక్షణమైన కామెడీ టైమింగ్‌తో ఎప్పటిలాగే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఫరియా అబ్దుల్లా తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించగా.. మానస చౌదరి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది. విలన్ పాత్రలో జె. డి. చక్రవర్తి తన మార్క్ నటనతో, డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. శుభలేఖ సుధాకర్ లాంటి సీనియర్ నటుడు ఎంతో గంభీరమైన సన్నివేశాల్లో సైతం తనదైన హాస్యాన్ని పండిస్తూ ఆకట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్ తదితరులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి సినిమాకు బలాన్ని చేకూర్చారు.

టెక్నికల్ టీం :

స్వీకర్ అగస్తి అందించిన సంగీతం, పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఎడిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి, సాగదీతగా అనిపించిన కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటే బాగుండేది. విద్యాసాగర్ చింత అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా కెమెరాలో బంధించారు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఆలోచన, టేకింగ్ బాగున్నప్పటికీ.. దాన్ని అంతే సమర్థవంతంగా స్క్రీన్ ప్లే గా మలచడంలో కాస్త తడబడ్డాడు. నిర్మాతలు కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుపెట్టారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా గాయపడ్డ సింహం.. సింపుల్ అండ్ ఎంటర్‌టైనింగ్..!

Follow Us