AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mayookha Review: ‘మయూఖ’ సినిమా రివ్యూ.. ఇంటర్నేషనల్ అవార్డులు గెలిచిన సినిమా మెప్పించిందా..?

రిలీజ్‌కు ముందే 'న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్' వేదికపై ఉత్తమ మిస్టరీ చిత్రంగా అవార్డు అందుకుని అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసిన సినిమా మయూఖ. సస్పెన్స్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? విడుదల తర్వాత ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూద్దాం..

Mayookha Review: ‘మయూఖ’ సినిమా రివ్యూ.. ఇంటర్నేషనల్ అవార్డులు గెలిచిన సినిమా మెప్పించిందా..?
Mayookha Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 09, 2026 | 2:21 PM

Share

మూవీ రివ్యూ: మయూఖ

నటీనటులు: పాయల్ చెంగప్ప, అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ, మాస్టర్ షణ్ముఖ చరణ్, తదితరులు

సినిమాటోగ్రపీ: ఫర్హాన్ వడక్కం

ఎడిటర్: శరత్. జె.

సంగీతం: శిబి మాత్యూ అలెక్స్

నిర్మాత: శశిధర్ నల్ల

దర్శకుడు: శ్రీ తేజ్ ఎస్ కే

కథ:

దివ్య అనే యువతి దారుణ హత్యకు గురికావడంతో ఈ చిత్రం మొదలవుతుంది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి మయూఖ (పాయల్ చందప్ప) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో గుర్తుతెలియని మూడో వ్యక్తి తిరుగుతున్నాడనే ఫీలింగ్ ఆమెను వెంటాడుతుంది. భయంతో పోలీసుల సహాయం కోరినప్పటికీ ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో వాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత సీసీ కెమెరాలను చెక్ చేయగా తనతో పాటే పని చేసిన పాత కొలీగ్ ఆ ఫ్లాట్ కు వచ్చినట్లు గుర్తిస్తుంది. అదే టైంలో అతను మళ్లీ రాగా, వెంటనే అలర్ట్ అయిన ఆమె అతన్ని గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు కాల్ చేస్తుంది. అయితే తీరా పోలీసులు వచ్చి తలుపులు ఓపెన్ చేసేసరికి ఆ వ్యక్తి శవమై పడి ఉంటాడు. ఈ మర్డర్ కేసులో మయూఖను అరెస్ట్ చేసినా ఆ తర్వాత నిజాలు తెలుసుకుని విడిచిపెడతారు. ఇంతకీ మయూఖను వెంటాడుతున్న ఆ అగంతకుడు ఎవరు? ఆమె ఫ్లాట్ లో చనిపోయిన వ్యక్తికి, దివ్య హత్యకు ఉన్న లింక్ ఏంటి? అన్నదే మిగిలిన సినిమా.

కథనం:

వెబ్ సిరీస్‌లలో సైకో కిల్లర్ నేపథ్యంలో వచ్చే స్టోరీస్ మనం చాలానే చూస్తుంటాం. కానీ మన టాలీవుడ్‌లో మొదటిసారిగా ‘ఫ్రాంగింగ్’ అనే కొత్త పాయింట్ బేస్ చేసుకుని డైరెక్టర్ శ్రీతేజ్ మయూఖ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ కు కాలానికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. దీనికి న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ అవార్డు కూడా రావడం విశేషం. సెన్సార్ సభ్యులు సూచించిన కొన్ని కట్స్ తో, A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 11 నిమిషాలు ఉంది. కథ విషయానికి వస్తే, ఆఫీస్ వాళ్లు ఇచ్చిన అపార్ట్మెంట్ లో ఉండే ఒక లేడీ బ్యాంక్ ఎంప్లాయ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆ ఫ్లాట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీద ఆమెకు డౌట్ రావడం, అదే టైమ్ లో ఎంట్రీ ఇచ్చే కొత్త క్యారెక్టర్స్ వల్ల వాళ్ళే క్రైమ్ చేశారేమో అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా డైరెక్టర్ స్క్రీన్ ప్లే నడిపించారు. ముఖ్యంగా బిగ్ బాస్ అమన్ మసూద్, హీరోయిన్ మయూఖ మధ్య వచ్చే సీన్స్ చూస్తే అతనే సైకో కిల్లర్ అనే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి ట్విస్టులతో సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ ను లాక్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తొలి భాగం మొత్తం అసలు ఆ ఇంట్లో నిజంగానే దెయ్యం లేదా మరెవరైనా ఉన్నారా లేక ఇదంతా కేవలం హీరోయిన్ కున్న మానసిక భ్రమల వల్లే జరుగుతోందా అనే కన్ఫ్యూజన్ తో చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

ఇక ఈ మూవీలో వాడిన ‘ఫ్రాంగింగ్’ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే, చిన్నప్పటినుంచి వాసన తెలియని ఒక అబ్బాయి కోళ్ళను కాల్చినప్పుడు వచ్చే స్మెల్ కు అట్రాక్ట్ అవుతాడు. ఆ తరువాత మనుషులను కాల్చినప్పుడు వచ్చే వాసనకు మరింతగా ఎడిక్ట్ అయిపోయి, ఏకంగా కన్నతండ్రిని, సొంత చెల్లిని కూడా చంపే స్థాయికి వెళ్లడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఇలాంటి సీన్స్ పిల్లల్లో వయొలెన్స్ ను ఎంకరేజ్ చేసేలా ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించినా, అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండటంతో అప్పటివరకు ఓపిక పట్టాలి. హీరోయిన్ ఫ్లాట్ లో తోటి ఎంప్లాయ్ డెడ్ బాడీ దొరకడం, వాచ్ మెన్ యాక్టివిటీస్, మసూద్ క్యారెక్టర్ బిహేవియర్, మయూఖకు తోడుగా ఆమె ఫ్రెండ్ ఉండటం లాంటి సీన్స్ వల్ల సినిమా లెంత్ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఇన్ని మలుపుల తర్వాత అసలు ఆ సైకో కిల్లర్ ఎవరనేది క్లైమాక్స్ లో రివీల్ అయినప్పుడు మాత్రం ఆడియన్స్ కు ఒక సాలిడ్ థ్రిల్ దొరుకుతుంది. ఆ ఎండ్ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే మాత్రం కచ్చితంగా స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటులు:

ప్రధాన పాత్ర పోషించిన పాయల్ చెంగప్ప తన అద్భుతమైన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. అడుగడుగునా భయం, ఆందోళనతో పాటు ఎవరిని నమ్మాలో తెలియని అయోమయాన్ని తన ముఖకవళికల్లో చాలా చక్కగా పండించింది. బిగ్ బాస్ అమన్ మసూద్, అభిలాష్ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అభిలాష్ చూపించిన వేరియేషన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఇక మురళీధర్ గౌడ్, లావణ్య రాణి వంటి వారు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం:

ఈ తరహా సినిమాలకు ప్రాణమైన నేపథ్య సంగీతాన్ని సి.బి. మాథ్యూ అలెక్స్ చాలా అద్భుతంగా అందించాడు. సినిమాలో సాంగ్స్ లేకపోయినా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రతి సీన్ లో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. శరత్ ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. విడుదలకు ముందే అంతర్జాతతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీతేజ్ అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చాడు. ఫర్హాన్ వడక్కం సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత శశిధర్ నల్ల కథను నమ్మి పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద రిచ్ గా కనిపిస్తుంది. మిస్టరీ అంశాలను ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మయూఖ.. డీసెంట్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ..!

Follow Us