
హైదరాబాద్: క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో తన సినిమా కొనసాగడంలేదని మహేశ్ బాబు ప్రకటించినప్పటి నుంచీ టాలీవుడ్‌లో చర్చలు ఎక్కువయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఎందుకు వీళ్ల సినిమా ఆగిపోయింది? అసలేమైంది? వంటి ప్రశ్నలతో ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే మహేశ్ బాబు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే ఈ విషయం బయటకొచ్చింది. మహేశ్ బాబు స్క్రిప్ట్ పరంగా సూచించిన మార్పులకు సుకుమార్ ఒప్పుకోలేదని, అందుకే మహేశ్ వద్దనుకున్నాడనే వాదన వినిపిస్తోంది. దీంతో పంతంతో సుకుమార్ అల్లు అర్జున్‌తో ఆర్య-3 ప్రకటించాడని, మహేశ్ కూడా అనీల్ రావిపూడితో మూవీకి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.
సుకుమార్‌ను వద్దనుకుని మంచి పనే చేశాడు మహేశ్..?
సుకుమార్‌ను వద్దనుకుని మహేశ్ మంచి పనే చేశాడని మహేశ్ ఫ్యాన్స్ అంటున్నారు. రెండు ప్లాప్‌ల తర్వాత భరత్ అనే నేను సినిమాతో మహేశ్ హిట్ అందుకున్నాడు. తర్వాత కూడా హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో సుకుమార్, మహేశ్‌ల కాంబోలో వచ్చిన నేనొక్కడినే భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టింది. మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ ఘనవిజయం సాధించలేకపోయింది.
సుకుమార్ సినిమాలు అయితే హిట్ లేదా ప్లాప్ అవుతాయనే టాక్ ఉంది. దీంతో హిట్‌ను కొనసాగించాలనుకుంటున్న మహేశ్ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చెప్పాడట. మూవీకి సుకుమార్ ఎక్కువ టైం తీసుకోవడం కూడా మహేశ్ మైనస్ పాయింట్‌గా భావించాడట. ఈ కారణాల వల్లనే సుకుమార్‌తో మూవీని వద్దనుకుని మహేశ్ మంచి పనే చేశాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే ఎక్కువగా విజయాలనే సాధించాడు. కథ బోల్తా కొట్టినా కామెడీతో సినిమాను నిలబెడతాడు. చిత్రీకరణను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాడు. మూవీ కనీసం యావరేజ్ కావడం గ్యారెంటీ, ప్లాప్ మాత్రం కాదనే భరోసా ఉన్న డైరెక్టర్. అందుకే అనిల్ రావిపూడికి మహేశ్ మొగ్గు చూపాడనే టాక్ వినిపిస్తోంది.