
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తన విలక్షణమైన నటనతోనే కాకుండా, పర్యావరణం పట్ల తనకున్న నిబద్ధతతోనూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటారు. ఇటీవల ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని కొండల మధ్య గడిపిన విహారయాత్ర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమాన్ని సందర్శించి ఆధ్యాత్మికతలో మునిగిపోయిన భూమి, ఆ తర్వాత తన మకాంను హిమాచల్‌లోని ఒక లగ్జరీ ఎకో-రిసార్ట్‌కు మార్చారు. ప్రకృతి ఒడిలో ఆమె గడిపిన వెకేషన్ విశేషాలేంటో తెలుసుకుందాం.
స్టూడియో ముంబైకి చెందిన బిజోయ్ జైన్ రూపొందించిన ఈ రిసార్ట్, 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి విల్లాలు నార్డిక్ మినిమలిజం శైలిలో ఉంటాయి. వీటిని పూర్తిగా చేతితోనే నిర్మించారు, విశేషమేమిటంటే ఈ నిర్మాణాల్లో ఎక్కడా సిమెంట్ వాడలేదు. పురాతన మరియు ఆధునిక జీవనశైలి కలయికగా ఈ విల్లాలు కనిపిస్తాయి.
భూమి తన వెకేషన్‌లో “ఫారెస్ట్-టు-టేబుల్” భోజనాన్ని ఆస్వాదించారు. అంటే అడవిలో దొరికే తాజా పదార్థాలతో తయారు చేసిన పోషకమైన ఆహారం. ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో గ్రెనోలా, దానిమ్మ, పండ్ల గిన్నె, వివిధ రకాల బ్రెడ్లు, స్మూతీలు ఉన్నాయి. వీటితో పాటు హిమాచల్ సంప్రదాయ వంటకాలను కూడా ఆమె రుచి చూశారు. అవుట్‌డోర్ పూల్‌లో సేద తీరడం, అడవి పూలతో ఫోజులివ్వడం వంటి ఫోటోలు ఆమె ‘ప్యూర్ జాయ్’ను ప్రతిబింబిస్తున్నాయి.
సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఉండే ఈ రిసార్ట్‌లో బస చేయడం కొంచెం ఖరీదైన వ్యవహారమే. చండీగఢ్ నుండి రెండు గంటల ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి గదుల ధరలు ఇలా ఉన్నాయి. చాలెట్, కాటేజ్ రూమ్స్ ఒక్క రాత్రికి రూ. 42,000 నుండి రూ. 45,000 వరకు, చాలెట్, కాటేజ్ సూట్స్ (స్టడీ రూమ్‌తో) రూ. 54,000 నుండి రూ. 60,000 వరకు, వన్ బెడ్ రూమ్ విల్లా (1450 చదరపు అడుగులు) రూ. 75,000, ప్రైవేట్ విల్లాస్ (3 బెడ్ రూమ్స్) ఒక్క రాత్రికి రూ. 1,50,000 వరకు ఉన్నాయి.
దీనికి అదనంగా 18% జీఎస్టీ మరియు ఇతర సేవలకు (బోన్ ఫైర్, గాలా డిన్నర్) అదనపు ఛార్జీలు ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడుతూనే విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చని భూమి పెడ్నేకర్ తన వెకేషన్ ద్వారా నిరూపించారు. ప్రకృతికి దగ్గరగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఎకో-రిసార్ట్ ఒక అద్భుతమైన ఎంపిక.