కుమారుడి సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారని వస్తున్న ఆరోపణలపై నటి, ఎంపీ సుమలత స్పందించారు. తాను ఎలాంటి అధికార దుర్వినియోగం చేయలేదని బదులిచ్చారు. అంబరిష్-సుమలత దంపతుల కుమారుడిగా వెండితెరకు పరిచయమై కన్నడ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అభిషేక్. ప్రస్తుతం రెండో సినిమా ‘బ్యాడ్ మ్యానర్స్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మండ్యాలోని మైషుగర్ ఫ్యాక్టరీలో జరుగుతోంది.
కొంతకాలంగా మూసి ఉన్న ఈ ఫ్యాక్టరీలో సినిమా షూట్ నిర్వహించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ సుమలత కారణంగానే మూసివున్న ఫ్యాక్టరీలో చిత్రీకరణకు అవకాశమిచ్చారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. దీంతో సుమలత స్పందిస్తూ..‘బ్యాడ్ మ్యానర్’ చిత్రీకరణ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదన్నారు. ‘ఇలాంటి నిరాధర ఆరోపణలు ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదని, ఫ్యాక్టరీలో షూట్ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులను చిత్రబృందం ముందే జిల్లా యంత్రాంగం నుంచి తీసుకుందని తెలిపారు.