ఇటీవల సైరాతో ప్రేక్షకులను మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ మూవీలో నటిస్తుండగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ నెల నుంచే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో చిరు సరసన నటించేందుకు పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా నయనతార, తమన్నా, అనుష్క, కాజల్, శ్రుతీ హాసన్.. ఇలా కొందరి పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష కన్ఫర్మ్ అయిందట.
దీనికి సంబంధించి త్రిషతో సంప్రదింపులు జరిగాయని.. కథను మెచ్చిన ఆమె, ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అంతేకాదు మూవీ షూటింగ్ కూడా పాటతోనే మొదలవుతుందని తెలుస్తోంది. అయితే ఇంతకుముందు చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అప్పుడు యావరేజ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కబోతోన్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.