షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ దారుణ ఘటనతో అమ్మాయిల తల్లిదండ్రుల్లో మరింత భయం పట్టుకుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తమ ఆడ బిడ్డలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ ఘటనపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అత్యాచారం చేసే వారిని ఉరి తీయాలంటూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ నిరసనను తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ సందేశం ఇచ్చాడు.
‘‘అది సినిమాలో భాగమని తెలిసినా మీ ఫేవరెట్ హీరోయిన్ మీద చేయి వేస్తే.. ‘చెయ్యి తీ’, ‘హాత్ నికాలో’ అని కామెంట్లు చేస్తుంటారు. మన చుట్టూ ఉన్న అమ్మాయిలపై కూడా అదే ప్రేమ, జాలిని చూపిస్తే ప్రియాంక లాంటి బాధితులు మన సమాజంలో ఉండరు కదా’’ అని కామెంట్ పెట్టాడు. కాగా మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నాతో తీసుకున్న ఫొటోలకు సోషల్ మీడియాలో పలు మీమ్స్ వచ్చాయి. వాటన్నింటిని పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్.. ఈ కామెంట్ పెట్టాడు.