మనీలాండరింగ్ కేసులో రూ.263 కోట్ల మోసాలకు పాల్పడ్డ నేరం కింద ప్రముఖ బాలీవుడ్ నటి కృతి వర్మను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. రోడీస్, బిగ్ బాస్ సీజన్ 12లో మెరిసి సినీనటిగా మారిన మాజీ ఆదాయపు పన్నుశాఖ అధికారిణి కృతివర్మపై మనీలాండరింగ్ కేసు నమోదవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ నుంచి నటిగా మారిన కృతి వర్మను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు మార్లు విచారించింది. కృతి వర్మ ఆదాయపు పన్ను అధికారిగా ఉన్న సమయంలో తన సీనియర్‌ల లాగిన్‌లను ఉపయోగించి రూ.264 కోట్లమేర మోసాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ కేసులో కృతి వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ పాటిల్ కీలక నిందితుడిగా గుర్తించారు. అక్రమ నిధులు చాలా వరకు పాటిల్ ఖాతాకు చేరాయని, కొంత భాగాన్ని వర్మ పేరు మీద ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు ఈడీ విచారణలో తేలింది. ఐతే భూషణ్ పాటిల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
గత ఏడాది ఐటి డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, తానాజీ మండల్ అధికారి, పన్వేల్ భూషణ్ అనంత్ పాటిల్‌కు చెందిన వ్యాపారి, ఇతరులపై ఆదాయపు పన్ను రీఫండ్‌ల మోసం కేసు నమోదైంది. పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకల్లో రూ.69.65 కోట్ల విలువైన 32 స్థిరాస్తులు, చర ఆస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో భూషణ్ అనంత్ పాటిల్, రాజేష్ శెట్టి, సారిక శెట్టి, కృతి వర్మ తదితరుల పేరిట ఉన్న భూమి, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి.
కృతి వర్మ హర్యానాలోని గురుగ్రామ్‌లో 2021లో సంపాదించిన ఒక ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బుతో నిందితుల పేర్ల మీద.. లోనావాలా, ఖండాలా, కర్జాత్, పూణే, ఉడిపి ప్రాంతాల్లో భూమి, పన్వెల్, ముంబై ప్రాంతాల్లో ఫ్లాట్లు, మూడు లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. 2007-08, 2008-09 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి బూటకపు రీఫండ్‌ల జారీపై ఢిల్లీలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 12 మోసపూరిత టీడీఎస్ రీఫండ్‌ల కింద రూ. 263.95 కోట్లకు చేరాయని పీఎమ్‌ఎల్‌ఏ కింద జరిగిన ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.