Surender Reddy: మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా.. సైరాను సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. ఇక ఇదే ఊపులో ఆయన వరుస సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ సైరా విడుదలై ఆరు నెలలు పూర్తి అవుతున్నా.. తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు సురేందర్. ఈ క్రమంలో ఆయనపై పలు రకాల వార్తలు కూడా వినిపించాయి. ఒకరు, ఇద్దరు స్టార్ హీరోలను కలిసి సురేందర్ స్టోరీలను వినిపించినప్పటికీ.. ఆయనతో పనిచేసేందుకు వారు సిద్ధంగా లేరని గాసిప్ వచ్చింది. అందుకే యంగ్ హీరోలతో సురేందర్ తదుపరి చిత్రాన్ని తీయాలని భావిస్తున్నాడని ఫిలింనగర్‌లో టాక్ నడిచింది.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారట. తన గత చిత్రాలకు పనిచేసిన రైటర్, దర్శకుడు వక్కంతం వంశీతో కలిసి రేసు గుర్రం 2కు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట సురేందర్. ఈ కథను ఇప్పటికే బన్నీకి వినిపించడం, అతడు ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. అలాగే వరుణ్ తేజ్‌తో ఓ సినిమాను తీసేందుకు ఈయన సిద్ధంగా ఉన్నారట. దానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నట్లు టాక్. ఇవి రెండు కాకుండా దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా సురేందర్ రెడ్డి మరో సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనూ సురేందర్ ఓ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తుంటే సురేందర్ రెడ్డి నాలుగు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. సినిమాలే కాదు సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను కూడా సురేందర్ రెడ్డి నిర్మించే ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం ఏంటి..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read this story also:‘రామ రాజు’గా చెర్రీ.. ‘సీత మహాలక్ష్మి’గా అలియా.. లుక్‌లు లీక్..!