దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ డీఎస్పీ.. టాలీవుడ్‌లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు సినిమా పోస్టర్ మీద కనిపిస్తే చాలు ఆ మూవీ సగం హిట్ అన్న నమ్మకం అందరిలో ఉండేది. అయితే ఈ సంగీత దర్శకుడు ఇటీవల కాస్త వెనుకబడ్డారు. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చిత్రాల తరువాత దేవీ సంగీతం అందించిన మూవీలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినప్పటికీ.. సంగీత దర్శకుడిగా ఆయనకు పెద్ద గుర్తింపు రాలేదు. ఇక ఈ ఏడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు పాటల విషయంలో ఆయన పని తీరుపై చాలా విమర్శలే వచ్చాయి. రాక్‌స్టార్ మ్యూజిక్‌లో మ్యాజిక్ మిస్ అయ్యిందని.. తన పాత పాటలను తానే రిపీట్ చేస్తున్నారని చాలామంది విమర్శించారు. ఈ క్రమంలో ఆయనతో తరచుగా పనిచేసే దర్శకులు సైతం దూరంగా వెళ్లినట్లు గుసగుసలు వినిపించాయి.
ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పుడు సినిమాలకు బ్రేక్ పడినప్పటికీ.. దేవీపై మాత్రం పుకార్లు ఆగడం లేదు. ముఖ్యంగా దేవీ ఖాతాలో ఇప్పుడు బన్నీ ‘పుష్ప’ సినిమా మినహా పెద్ద హీరోల సినిమాలేవీ లేవని.. పుష్ప విషయంలోనూ దేవీని తీసేసి, థమన్‌ను పెట్టాలని ఇప్పటికీ బన్నీ సుకుమార్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాడని.. దేవీకి ‘పుష్ప’ సినిమానే చివరి అవకాశం. ఈ సినిమాకు సరిగా ఇవ్వకపోతే ఆయనను సుకుమార్ కూడా పక్కన పెట్టేస్తారని.. దేవీకి ఇక ఆఫర్లే రావు అని.. ఇలా పలురకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అసలు విషయంలోకి వెళ్తే.. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ ప్రతి మనిషికి ఒడిదుడుగులన్నవి చాలా సహజం. ప్రతిసారి అందరూ విజయాలను సాధించలేరు. అలాగని అందరికీ పరాజయాలు కొనసాగవు.
ఇక దేవీ శ్రీ విషయానికొస్తే.. ఈ సంగీత దర్శకుడు తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. సంవత్సరానికి ఐదారుకు మించి ఎక్కువ సినిమాలు చేయకపోవడం.. రీమిక్స్‌కు దూరంగా ఉండటం.. ఇలాంటి కొన్ని లిమిట్స్ పెట్టుకున్నారు దేవీ. ఈ రూల్స్‌ను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఫాలో అవుతూ వస్తున్నారు. అంతేకాదు సినిమా కంటెంట్‌కు కూడా ఆయన చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. అందుకే కొన్ని సార్లు ఏడాదికి రెండు సినిమాలు మాత్రమే చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దేవీ మ్యూజిక్ మైనస్ అయిన సందర్భాలు చాలా తక్కువ.
నిజానికి చెప్పాలంటే.. దేవీనే కాదు మిగిలిన టాప్ సంగీత దర్శకులను తీసుకున్నా.. వారు కూడా అన్నీ సినిమాలకు గుర్తుండిపోయే ఆల్బమ్‌లను ఇవ్వడం లేదు. ప్రతి సినిమాలో ఏదో ఒకటి, రెండు మాత్రమే గుర్తుండిపోతున్నాయి. ఇంకా కొన్ని పాటలైతే అలా వచ్చి.. ఇలా పోతున్నాయి. ఇక ఈ మధ్య దేవీ సంగీతం అందించిన ‘ఉప్పెన’లోని రెండు పాటలు రావడంతో పాటు.. అవి మంచి టాక్‌ను కూడా తెచ్చుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేవీపై మాత్రమే ఇంత నెగిటివిటీ ఎందుకు పెరుగుతుందన్నది కొందరిలో తొలుస్తున్న ప్రశ్న.
ఇదిలా ఉంటే రాక్‌స్టార్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఆయన చాలా సినిమాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సింగర్స్‌తో కలిసి ఆల్బమ్ చేయాలన్నది తన కల అని చాలాసార్లు చెప్పిన రాక్‌స్టార్.. ఈ ఏడాది ఎలాగైనా ఆ ఆల్బమ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆయనే కొన్ని సినిమాలను వద్దనట్లు తెలుస్తోంది. ఏదేమైనా టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు ఎలాగైనా తెచ్చుకోగలరన్నది నిజమెరిగిన సత్యం. కాగా ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్.. ఉప్పెన, అల్లుడు అదుర్స్, గుడ్ లక్ సఖి, రంగ్ దే, పుష్ప చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. వీటితో పాటు పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించే సినిమాకు దేవీనే సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: ఆ లేఖ రాసింది నేనే: రమేష్ కుమార్ క్లారిటీ..!