
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తరవాత పుంజుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందినవారు ‘చిత్రలహరి’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వారి ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. చిరు స్వయంగా ‘చిత్రలహరి’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తోన్న వీడియోను మైత్రి మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో ఉంచింది.
ఒక సెటిల్డ్ మెసేజ్‌ను ఆద్యంతం చాలా చక్కగా చూపించి కిశోర్ తిరుమల తన దర్శకత్వ ప్రతిభను కనబరుచుకున్నారని చిరంజీవి అన్నారు. తేజూ కూడా చాలా చక్కగా నటించి పరిణితి చెందిన నటుడిగా నిరూపించుకున్నాడని కొనియాడారు. పోసాని క్రిష్ణమురళి, సునీల్‌తో పాటు ఇతర నటీనటులు చాలా చక్కగా నటించి చిత్రానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చారన్నారు. ఇక, మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ తన సత్తాను చాటుకున్నాడని చెప్పారు. సక్సెస్‌ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మైత్రి మూవీ మేకర్స్ అని.. వారి ప్రతిష్ఠ మరింత పెరిగేలా ఈ సినిమాను రూపొందించారని ప్రశంసల వర్షం కురిపించారు.
‘ఈ చిత్రంలో బంధాలు బాంధవ్యాల గురించి, మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకుల అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూడదగినది ఈ ‘చిత్రలహరి’’ అని చిరంజీవి వీడియోలో వెల్లడించారు.
ఈ వీడియోను ట్వీట్ చేసిన హీరో సాయిధరమ్ తేజ్ తన మావయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు కురిపించిన ప్రశంసలకు, మూలస్తంభం మాదిరిగా మాకు మద్దతుగా నిలిచినందుకు థాంక్యూ సో మచ్ మామ. నా భావాలను వ్యక్తపరచడానికి ప్రస్తుతం చాలా తక్కువ పదాలను వాడుతున్నాను. థాంక్యూ సో మచ్’ అని తన ట్వీట్‌లో తేజూ పేర్కొన్నారు.
Thank you so much mama for your lovely words and being a huge pillar of support…I’m falling short of words for describing my feelings right now… Thank you so much ?❤️❤️❤️ https://t.co/ZYZDZ0WyU3
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 14, 2019