
లాక్‌డౌన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్ అయ్యారు. ఓ వైపు సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ) పనులు చూసుకుంటూ, మరోవైపు కుటుంబసభ్యులతో గడుపుతూ.. అప్పుడప్పుడు పలు ఛానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో చిరు చాలా విషయాలే పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన తదుపరి సినిమాల గురించి ఇటీవల మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేశారు. ఏ యంగ్ హీరో కూడా లైన్‌లో పెట్టనంతమంది దర్శకులను ఆయన క్యూలో పెట్టుకున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నానని, దానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఇక ఈ మూవీల తరువాత బాబీ, మెహర్ రమేష్‌లు తనకు కథలు చెప్పారని వివరించారు. అంతేకాదు సుకుమార్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, పరశురామ్ తదితరులు కూడా తనతో పనిచేసేందుకు ఆసక్తిని చూపుతున్నారని చిరంజీవి స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన తరువాత మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిని చెందుతున్నారు. ముఖ్యంగా ఆ లిస్ట్‌లోని ఒక దర్శకుడు అస్సలు ఫామ్‌లో లేరని.. ఆ దర్శకుడు వద్దని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రకటించిన ప్రాజెక్ట్‌లన్నీ సెట్స్ మీదకు వెళ్లవు. దీంతో ఈ సినిమాన్నీ సెట్స్ మీదకు వెళ్లినప్పుడు కదా అంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి చిరంజీవి ఇప్పుడు ప్రకటించిన దర్శకుల్లో .. ఎప్పుడు ఎవరితో సెట్స్ మీదకు వెళతారు..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.