
New Year’s Gift to Bunny: టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అందరికి కమెడియన్‌గానే తెలుసు కానీ ఆయన ఆల్‌రౌండర్ అన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అతడిలో ఓ చిత్రకారుడు కూడా ఉన్నాడని లాక్‌డౌన్‌లో కొంతమందికి తెలిసొచ్చింది. బ్రహ్మానందం పేపర్‌పై పెన్సిల్ పెట్టాడంటే అందమైన దృశ్యమాలిక సిద్దమవుతుందని అర్థం.
తాజాగా బ్రహ్మి చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని చాటుతున్నారు. అందమైన చిత్రాలు వేసి తన ఇష్టమైన వారికి బహుమానంగా అందిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రేమతో రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడి చిత్రాన్ని వేయగా ఎంతో సుందరంగా వచ్చింది. అంతేకాకుండా వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసి దానిని ఫ్రేం చేసి అల్లు అర్జున్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా పంపారు. దీనిని చూసి మురిసిపోయిన బన్నీ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. బ్రహ్మానందం గారి నుండి అందుకున్న అమూల్యమైన బహుమతి అని ట్వీట్ చేశారు. 45 రోజుల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని వేశారని కొనియాడారు. తనకు బహుమతి అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.