కొన్ని కథలను భద్రపరచుకోవాలి. వాటితో ప్రమేయం ఉన్నవారి సమక్షంలోనే వాటిని పదిలపరచుకోవాలి. 83 విషయంలో జరిగింది అదే. 1983 వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కిన సినిమా 83. అప్పటి కెప్టెన్ కపిల్‌దేవ్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు చెప్పిన సంఘటనల కూర్పుగా తెరకెక్కించిన సినిమా.
సినిమా: 83
దర్శకత్వం: కబీర్ ఖాన్
రచన: సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్, వాసన్ బాలా
నిర్మాణం: దీపిక పదుకోన్, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియడ్‌వాలా, అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్, 83 ఫిల్మ్ లిమిటెడ్
నటీనటులు: రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్, చిరాగ్ పాటిల్, దిన్‌కర్ శర్మ, నిశాంత్ దాహియా, హర్డీ, సాహిల్, అమ్మీ, అదినాథ్, ధైర్య తదితరులు
కెమెరా: అసీమ్ మిశ్ర
ఎడిటింగ్: నితిన్ బెయిడ్
విడుదల: 24 డిసెంబర్ 2021
నిడివి: 162.52
83 సినిమాలో కథేంటి? అని అడిగితే 1983లో భారత క్రికెట్ టీమ్ వెస్ట్ ఇండీస్ మీద, ఇంగ్లండ్ మీద సాధించిన విజయం ఎలాంటిది? 1983 వరల్డ్ కప్‌కి వెళ్లినప్పుడు మన ప్లేయర్ల పట్ల జనాలకు ఎలాంటి భావం ఉండేది? మన వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఆడారు? ఎలా నెగ్గుకు వచ్చారు? కప్పు తీసుకురావడంలో ఎవరి ప్రమేయం ఏంటి? ఆటగాళ్ల మానసిక పరిస్థితులేంటి?… స్థూలంగా కథ ఇంతే.
కానీ ఒక్కో ఫ్రేమ్‌నీ చెక్కినట్టు తీశారు. కెమెరా ముందు క్లోజప్ షాట్స్ లో అతి కొద్ది మంది ఆర్టిస్టులతో తీసే సినిమా కాదు ఇది. ప్రతిరోజూ స్టేడియంలో లైట్లు ఫిక్స్ చేయాలి. ఆర్టిస్టులకు సజెషన్స్ ఇవ్వాలి. అక్కడున్న అంత క్రౌడ్‌నీ కంట్రోల్ చేసుకోగలగాలి. నిర్మాణం పరంగా అత్యంత భారీ వ్యయంతో కూడుకున్నదే. అంతకు మించి డైరక్షన్ డిపార్ట్ మెంట్ శ్రమకోర్చి చేసిన ప్రాజెక్ట్.
ఆటలో గెలవాలంటే ఏం కావాలి? అవతలివాళ్ల గురించి తెలియాలా? మనం వెళ్లి ఆడుతున్న ప్రదేశం ఆనుపానులు అర్థం చేసుకోవాలా? వారి భాషలో మాట్లాడాలా? వాళ్ల అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకుని, వాటికి సమాధానాలు ఎలా ఇవ్వాలా అని ఆలోచించాలా? అవన్నీ ఉంటే ఉండొచ్చు. ఉండకపోయినా ఫర్వాలేదు. కానీ వాటన్నిటినీ మించింది ఒకటి కావాలి. సంకల్ప బలం. గెలుస్తామనే నమ్మకం. మన పని మీద మనకున్న ధ్యాస. ప్రయత్నలోపం లేకపోవడం.
మనతో ఉన్న వాళ్లకి గెలుస్తామనే నమ్మకాన్ని కల్పించే తీరు. 83 ఆటలో కపిల్‌దేవ్ చేసింది, 83 స్క్రీన్ మీద రణ్‌వీర్ చేసిందీ అదే. అవతలి వాళ్లు రాసిన చెత్త రాతలున్న పేపర్‌ని షూ తుడవడానికి వాడుకున్నాడు కపిల్‌దేవ్. గ్రౌండ్‌లో దిగినప్పుడు తోటివారిని నమ్మి అవకాశాలిచ్చాడు. పెద్దా చిన్నా తేడా లేకుండా టీమ్ సభ్యుల సలహాలను సరైన సమయంలో ఆమోదించాడు. ఆచరించాడు. అవసరమైన చోట టీమ్‌ని అదుపులో పెట్టాడు. మందలించాడు. అందరిలో తానూ ఒకడిననే భావం కలిగించాడు.
అలాంటి ఎమోషన్స్ అన్నిటినీ చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు డైరక్టర్. చిన్న చిన్న మాటలతోనే ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించారు. సినిమాకు రీరికార్డింగ్ చాలా ప్లస్ అయింది. పాటలు సినిమాతోనే సాగుతున్నా ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించాయి. స్క్రీన్ నుంచి చూపు తిప్పితే ఎక్కడ ఏం మిస్ అవుతామో అన్న ఫీలింగ్ కలిగింది. కపిల్‌దేవ్ కోసం క్రికెట్ చూడాలనుకునే చిన్న పిల్లాడు కనిపించకపోతాడా అని కళ్లు వెతికేంతలా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా అనిపించింది.
83లో క్రికెట్ గ్రౌండ్ చుట్టూ పరిసరాలు, అక్కడి భారతీయులు గ్రౌండ్‌లో క్రికెట్ చూసిన విధానం, మన దేశ పరిస్థితులు, వరల్డ్ కప్ చూసి ఇన్‌స్పయిర్ అయిన యువత, బార్డర్‌లో వరల్డ్ కప్ రోజు ఏం జరిగింది.. ఇలా పలు కోణాలను చాలా చక్కగా కవర్ చేశారు డైరక్టర్.
రణ్‌వీర్‌సింగ్‌కి తెలుగులో సుమంత్ అందంగా డబ్బింగ్ చెప్పారు. సినిమాను స్మూత్‌గా నడిపిన అంశాల్లో అది కూడా ఒకటి. అక్కడక్కడా మెరుపువేగంతో కపిల్‌దేవ్ ఒరిజినల్ షాట్స్ చూపించడం బావుంది. కపిల్‌దేవ్ భార్యగా దీపిక చక్కగా నటించారు.
కేరక్టర్స్ ని డిజైన్ చేసిన తీరు, ఆయా కేరక్టర్స్ లుక్స్, కాస్ట్యూమ్స్, స్టైలింగ్, డైలాగులు, మ్యూజిక్, కెమెరా… ఇలా అన్ని విషయాల్లోనూ తీసుకున్న శ్రద్ధ స్క్రీన్ మీద కనిపించింది.
కొన్ని సినిమాలు మనకు గర్వకారణం. 83 అలాంటిదే. 83 సినిమా కాదు. మన చరిత్ర. మనమే కాదు, మన భావితరాలు కూడా గర్వంతో తలెత్తుకుని గుర్తుచేసుకునే ఘనత. సినిమా పరంగా ఒకటీ అరా లోపాలున్నా పట్టించుకోనవసరం లేదు. ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూడాల్సిన సినిమా.
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..
Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..
Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీవల్లి సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..