విడుదలకు ముందే తలైవి సినిమాకు ఊహించని షాక్ తగిలింది. రేపు ఈ మూవీ దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుండగా.. అనూహ్యంగా సినిమాపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తుంది. ఇప్పిటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తలైవి మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని విబ్రి మీడియాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి , బ్రిందా ప్రసాద్ యాక్సిస్ బ్యాంక్ పై కార్తీక్ ఫిర్యాదు చేశాడు.
తనకు తెలియకుండానే విబ్రి మీడియా నుంచి విబ్రి మెషన్ పిక్చర్స్‌కు దాదాపు 75 లక్షలు బదిలీ చేశారని..ఇవన్ని 2020 ఫిబ్రవరి 17, 20 తేదీలలో జరిగిన అవతవకలని తెలిపాడు. ఈ నెల 6న పోలీసులకు అక్రమ నిధుల మళ్లింపుపై ఫిర్యాదు చేసిన కార్తీ్క్.. IPC 405,406,415,417,418, 420 సెక్షన్స్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కోన్నాడు. ఇక రేపు (సెప్టెంబర్ 10న) తలైవి విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందు సినిమాపై ఫిర్యాదు రావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈసినిమాను విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విష్ణువర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా.. కేవి విజయేంద్ర ప్రసాద్, మధన్ కార్కీ, రజత్ అరోరా కథను మూడు భాషలలో అందించారు.