నర్గీస్ ఫక్రీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ. పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘రాక్ స్టార్’తో సహా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఈ వయ్యారి పేరు ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఉన్నట్టుండి బాలీవుడ్ లో నేషనల్ మీడియాలో ఈ చిన్నదాని పేరు హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమాల ద్వారా కాదు. తన సోదరి అలియా కారణంగా నర్గీస్ ఫక్రీ పేరు వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ పోలీసులు నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను అరెస్టు చేసినట్లు సమాచారం.
అలియాపై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అలియా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేసిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం, అలియా న్యూయార్క్‌లో తన మాజీ ప్రియుడిని హత్య చేసినట్టు తెలుస్తోంది. అలియా మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ తన స్నేహితుడు ఎటియన్‌తో కలిసి ఓ గ్యారేజీలో ఉన్న సమయంలో అలియా ఆ గ్యారేజ్ కు నిప్పు అంటించింది. ఈ ఘటనలో ఎడ్వర్డ్ జాకబ్స్ తన స్నేహితుడు ఇద్దరూ మరణించారు.
అలియా అరెస్టు తర్వాత ఆమెను క్వీన్స్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచినట్లు కూడా చెబుతున్నారు. అయితే ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా పొందలేకపోయిందని సమాచారం. ఈ విషయంపై అటార్నీ మెలిండా కాట్జ్ మాట్లాడుతూ.. నిందితురాలు ఉద్దేశ్యపూర్వకంగానే గ్యారేజ్ కు నిప్పంటించిందని, దీని వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ విషయంపై నర్గీస్ తల్లి మాట్లాడుతూ.. తన కూతురు ఇలా చేయలేదని తెలిపారు. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఇతరులను కూడా బాగా చూసుకుంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక నర్గీస్ ఫక్రీ విషయానికొస్తే ఆమె సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. వచ్చే ఏడాది ‘హౌస్‌ఫుల్ 5’లో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమెతో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. గత 13 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు. 2011లో విడుదలైన రణ్‌బీర్ ‘రాక్‌స్టార్’ ఆమె మొదటి చిత్రం. ‘రాక్‌స్టార్’ ద్వారా నర్గీస్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘అజర్’, ‘డిషూమ్’ సహా పలు పెద్ద సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.