డైరెక్టర్ మహేశ్ భట్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియాభట్(Alia Bhatt). బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. అంతకంటే ముందు ‘గంగూబాయి కథియావాడి’ గా బాక్సాఫీస్‌పై దండేత్తేందుకు సిద్ధమవుతోంది. సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న అలియా భట్ తాజాగా తన వృత్తిగత వివరాలతో పాటు తన యిష్టాయిష్టాలు, అభిరుచులు గురించి పంచుకుంది. అవేంటంటే..
కళ్లను చూసి క్యారెక్టర్ కనిపెట్టేస్తా!..
ఎదుటి వ్యక్తిలో నిజాయతీని ఇష్టపడతానని చెప్పుకొచ్చిన అలియా మగవారి కళ్లు చూడగానే వారి క్యారెక్టర్‌ను ఎంతో కొంత అంచనా వేయచ్చంది. చీకటంటే తనకు భయమని, ఎవరైనా ఎదురైతే వాళ్ల పెర్‌ఫ్యూమ్ ఏమిటో చెక్ చేయడానికి వాసన చూడడం తన బలహీనతని చెప్పుకొచ్చింది. ఇక తన హ్యాండ్‌బ్యాగ్‌లో తప్పనిసరిగా నాలుగైదు పెర్‌ఫ్యూమ్ బాటిళ్లు ఉంటాయంటోంది. రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా డైరీ రాస్తానని, అందులో ముఖ్యమైన విషయాలన్నీ నోట్ చేస్తానంటోంది. తానూ, రణబీర్ కపూర్ ఒకేసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని విషయమన్న అలియా.. షారుఖ్ తన ఫేవరట్ కో స్టార్ అని చెప్పుకొచ్చింది. కరోనా లేకపోయి ఉంటే రణబీర్‌తో ఈపాటికే తన పెళ్లి తంతు పూర్తయ్యేదని, అయితే ఏం జరిగినా మన మంచికే కదా అంటూ వేదాంతం కూడా వల్లించిందీ అందాల తార. తనకు పప్పన్నం, పిజ్జా అంటే మరీ ఇష్టమనీ బంగాళదుంపతో ఏం చేసినా ఇష్టంగా తింటానని తన యిష్టయిష్టాల గురించి చెప్పుకొచ్చింది.