Bigg Boss 10: బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం ట్విస్టులు.. 43 లక్షలకు చేరిన ప్రైజ్ మనీ.. షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
బిగ్ బాస్ తెలుగు ఐదో వారం ముగిసింది. అపూర్వ, చరణ్ ఎలిమినేట్ కాగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ప్రైజ్ మనీ రూ.43 లక్షలకు చేరింది. నిన్న హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ షాలినిని టార్గెట్ చేశారు. షాలిని ఆట పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం రోడ్ టు రీలోడ్ ముగిసింది. ఈ వారం ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోగా.. అపూర్వ, చరణ్‌లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. శివ్, దక్ష, నీతూ మాస్టర్, శ్వేతా నాయుడు, రామకృష్ణలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే కొత్తగా వచ్చిన వారిలో నీతూ మాస్టర్ మాత్రమే త్రిగుణ్‌పై విజయం సాధించగా.. మిగిలిన వారంతా ఓజీ కంటెస్టెంట్ల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాలతో ప్రైజ్ మనీ లెక్కలు కూడా మారిపోయాయి. ఐదో వారం ఆటలో ఓజీ కంటెస్టెంట్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లతో జరిగిన పోటీల్లో ఓజీ టీమ్ గెలిచిన ప్రతిసారీ ప్రైజ్ మనీకి రూ.2 లక్షల చొప్పున జమయ్యాయి. గతంలో మిథిలేష్ తీసుకెళ్లిన రూ.15 లక్షలను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తానికి తాజాగా మరో రూ.8 లక్షలు యాడ్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ రూ.43 లక్షలకు చేరింది. చివరి వరకు ఈ మొత్తాన్ని కంటెస్టెంట్లు కాపాడుకుంటారా? లేక మరిన్ని ట్విస్టులు ఎదురవుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన శ్వేతా నాయుడు తన అభిప్రాయాలను ఏమాత్రం దాచుకోలేదు. రోహిత్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే.. షాలినీ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. షాలినీ చాలా లౌడ్‌గా ఉంటుందని, ఆమెను టీవీలో చూస్తున్నా తాను టీవీ సౌండ్ కూడా తగ్గించుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో హౌస్‌లో షాలినీపై ఉన్న అభిప్రాయాలు మరోసారి చర్చకు వచ్చాయి. తనకు కేటాయించిన బ్యాడ్జ్‌లను రోహిత్, నరేష్‌లకు ఇచ్చిన శ్వేతా.. ఆటలో మాత్రం వంశీతో పోటీ పడింది. అయితే ఆ పోరులో వంశీ విజయం సాధించాడు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామకృష్ణ కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. రోహిత్ అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు కనిపించిన ఫైర్ ఇప్పుడు హౌస్‌లో కనిపించడం లేదని అన్నాడు. షాలినీ బిగ్ బాస్ టైటిల్ కోసం కాకుండా రోహిత్ కోసమే వచ్చినట్టుగా కనిపిస్తోందంటూ కామెంట్ చేశాడు. ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా డేంజర్ జోన్‌లో ఉన్న షాలినీ, చరణ్‌లలో ఎవరు హౌస్‌లో కొనసాగాలని కోరుకుంటున్నారో చెప్పాలని నాగార్జున ఓజీ కంటెస్టెంట్లను అడిగారు. తమకు నచ్చిన కంటెస్టెంట్ పేరును రాయాలని సూచించారు. మొత్తం 11 ఓట్లలో షాలినీకి పది ఓట్లు వచ్చాయి. అమన్ మాత్రం చరణ్‌కు మద్దతుగా నిలిచాడు.
అమన్ నిర్ణయంపై రోహిత్ ప్రశ్నలు సంధించాడు. చరణ్‌కు ఒక్క ఓటు కూడా రాకపోవచ్చనే ఉద్దేశంతోనే తాను అతడికి ఓటు వేసినట్లు అమన్ చెప్పాడు. అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన చరణ్‌ను కూడా నాగార్జున ఇదే విషయంపై ప్రశ్నించారు. తనకు ఓటు వేసింది రోహిత్ లేదా అమన్ అయి ఉండొచ్చని చరణ్ సమాధానమిచ్చాడు. అయితే అమన్ ఓటు వేసినట్లు నాగార్జున వెల్లడించారు. ఇదే సమయంలో ఇంట్లో ఎవరు ముందు ఒకలా.. వెనకాల మరోలా మాట్లాడుతున్నారని నాగార్జున అడగ్గా.. త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ పేర్లను చరణ్ చెప్పాడు. కొత్తగా వచ్చిన రామకృష్ణ, రామ్ ప్రసాద్ మధ్య జరిగిన పోటీ కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ ఆటకు అమన్ సంచాలకుడిగా వ్యవహరించాడు. అయితే పోటీలో రామకృష్ణ ఓటమి పాలవగా.. రామ్ ప్రసాద్ విజయం సాధించాడు. దీంతో ప్రైజ్ మనీకి మరో రూ.2 లక్షలు జమ అయ్యాయి. అలా చివరకు ప్రైజ్ మనీ రూ.43 లక్షలకు చేరినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
