Online Movie Tickets: సినిమా ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి టికెట్ కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సిన కష్టాలు తీరనున్నారు. వీటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ తరహాలో సినిమా థియేటర్ల టికెటింగ్ కోసం కూడా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విధివిధానాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో 8 మంది ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ , ఏపీటీఎస్ ఎండీ, కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ , ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ అమలు, బ్లూప్రింట్ రూపకల్పన బాధ్యతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. మొత్తంగా టికెటింగ్ వెబ్ పోర్టల్‌ను ఏపీ ఫిల్మ్ , టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ దీన్ని పర్యవేక్షించనుంది. మరోవైపు తెలంగాణ కూడా ఇదే బాటలో పయనిస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది.
కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా, పెద్ద సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా, ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్స్ యజమానులు, పంపిణీదారులు ఏదో రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటిని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించే అవకాశం కనిపిస్తోంది.