నేటి యువత ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం విషయంలో ఆలోచన ధోరణి మారుతోంది. వివాహం కెరీర్‌కు అడ్డుకట్ట అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కెరీర్‌లో స్థిరపడిన తర్వాతే పెళ్లికి ఓటేస్తున్న వారు పెరిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వివాహం సినీ కెరీర్‌కు బ్రేక్ అనే అభిప్రాయంలో ఉంటున్నారు. అయితే అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే.. పెండ్లి తర్వాత కూడా కెరీర్‌లో దూసుకుపోవచ్చు అంటోంది అందాల తార యామి గౌతమ్. ఫెర్ అండ్ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా పాపుల్ అయిన యామి గౌతమ్ హిందీతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. పెండ్లి తర్వాత కెరీర్‌కు సంబంధించి ఈ అందాల తార పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘పెండ్లి తర్వాత హీరోయిన్ కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటే పొరపాటే. కెరీర్‌కు పెండ్లి అడ్డు కాదని చాలా మంది హీరోయిన్లు నిరూపించారు. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. మ్యారేజ్ తర్వాత బాధ్యతలు పెరుగుతాయనేది నిజం. ప్రతీ మహిళ జీవితంలో ఇది ఉంటుంది. అయితే పెండ్లి తర్వాత జీవిత భాగస్వామి ప్రోత్సాహం లభిస్తే మహిళకు రెండింతల ఉత్సాహం వస్తుంది’ అని చెప్పుకొచ్చింది. ఇక తన భర్త ఆదిత్య ధర్ గురించి మాట్లాడిన యామి.. ‘నా భర్త కూడా సినిమా పరిశ్రమకు చెందినవాడే కావడం నాకు కలిసొచ్చిన విషయం. వృత్తి జీవితంలో నా సవాళ్లు ఏమిటన్నది ఒక రచయిత, దర్శకుడిగా ఆయనకు తెలుసు. అందుకే వరుస ప్రాజెక్టుల్లో పని చేయగలుగుతున్నా’ అని చెప్పుకొచ్చింది.
పాన్ ఇండియా కల్చర్‌పై స్పందించిన యామి.. పరిశ్రమలన్నీ ఒకేతాటిపైకి రావడం సంతోషకరమని తెలిపింది. ఇది నటీనటులతోపాటు అభిమానులకూ కలిసొస్తుంది. నచ్చిన భాషలో, మెచ్చిన తారల చిత్రాలు ఆస్వాదించవచ్చని చెప్పుకొచ్చింది. తెలుగులో నటించినది నాలుగు చిత్రాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకులు తనను బాగా ఆదరించారని చెప్పుకొచ్చింది యామి. మంచి అవకాశం వస్తే తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తానని మనసులో మాట బయటపెట్టిందీ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..