సినిమా ఫీల్డ్కు సరిపోనేమో.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..
సినిమా రంగంలో విజయాలు సాధించాలంటే ప్రతిభతో పాటు అవకాశాలు, పరిచయాలు, ఇతర సమీకరణాలు కూడా ప్రభావం చూపుతాయనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆనంది చేసిన వ్యాఖ్యలు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. తాజాగా నటి ఆనంది చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి

ప్రస్తుతం హీరోయిన్ ఆనంది చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చకు దారితీస్తున్నాయి. సహజమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి.. తాజాగా గరివిడి లక్ష్మి సినిమా వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు ఆనంది. ‘నేను ఈ సినిమా ఫీల్డ్కు సరిపోనేమో..’ అంటూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఇంతకీ ఆనంది ఎందుకలా మాట్లాడారు.? ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న సందర్భమేంటి.? నటి ఆనంది ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గరివిడి లక్ష్మి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమా రంగంలో కొనసాగాలంటే ఎన్నో లెక్కలు, క్యాలుకులేషన్స్ ఉంటాయనే భావనను ఆమె తన మాటల ద్వారా వ్యక్తం చేశారు. తన మనసులోని బాధను చెప్పుకునే క్రమంలో భావోద్వేగానికి గురైన ఆనంది.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.
నటనకు ప్రాధాన్యం ఇస్తూ, పాత్ర కోసం ఎంతో కష్టపడే కళాకారులకు పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులపై ఆమె వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. గరివిడి లక్ష్మి సినిమాలో ఆనంది ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటించడం తనకు సవాలుతో కూడుకున్న అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆ ప్రాంతపు యాస, భాషను సహజంగా పలకడంతో పాటు పాత్రలోని భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని వివరించారు.
ఒక పాత్రకు న్యాయం చేయాలంటే కేవలం సంభాషణలు చెప్పడం మాత్రమే సరిపోదని, ఆ వ్యక్తి జీవనశైలి, మాటతీరు, భావాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆనంది ప్రయాణం మరోసారి గుర్తుచేస్తోంది. ఈ సినిమా ద్వారా గరివిడి లక్ష్మి వంటి కళాకారిణికి మరింత గుర్తింపు లభించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సినిమా రూపుదిద్దుకోవడంలో దర్శకుడు గౌరి నాయుడు జమ్ము చేసిన కృషిని ఆనంది ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి పాత్రను తెరపై సహజంగా ఆవిష్కరించడానికి దర్శకుడి దృష్టి, పట్టుదల ఎంతో అవసరమని పేర్కొన్నారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి శ్రమ ప్రేక్షకులకు చేరాలని ఆమె కోరుకున్నారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆనంది భావోద్వేగంగా చెప్పారు. ఒకవైపు పాత్ర కోసం పడిన కష్టం, మరోవైపు సినిమా పరిశ్రమలోని పరిస్థితులపై ఆమె వ్యక్తం చేసిన ఆవేదన ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలిచాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
