బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ పురస్కారం గెల్చుకున్న ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఆమిర్. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇదే సమయంలో మరో పాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్’ విడుదల కానుంది.
ఇలా రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం వల్ల చిత్ర నిర్మాతలకు నష్టం కలుగుతుందని చాలామంది భావిస్తున్నారు. కాగా ఇలా విడుదల తేదీలు క్లాష్ అవ్వడంపై ఆమిర్ కేజీఎఫ్ చిత్ర బృందానికి క్షమాఫణలు చెప్పారు. ‘ నేను ఎప్పుడూ ఇతర నిర్మాతలు ఫైనలైజ్ చేసిన తేదీలను తీఉకోను. సాధారణంగా నేను ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతుంటాను. నేను అనుకున్న అవుట్‌పుట్ వచ్చేవరకు కష్టపడుతుంటాను. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ విషయంలో కరోనా కారణంగా మా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అదే సమయంలో ఏదో అవసరంగా సినిమాను పూర్తి చేసేసి విడుదల చేయాలని మేం అనుకోవడం లేదు. ప్రస్తుతం సినిమా వీఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తవ్వడానికి మరింత ఆలస్యం కావచ్చు. ఇక ఈ సినిమాలో నేను సిక్కు యువకుడిగా కనిపిస్తాను. నేను ఇలాంటి పాత్రను చేయడం ఇదే మొదటిసారి. అందుకే సిక్కులకు అత్యంత ముఖ్యమైన రోజైన బైసాంకి పండగ (ఏప్రిల్14) రోజే నా సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఈ సందర్భంగా అదే రోజున విడుదలవుతున్న కేజీఎఫ్2 చిత్ర దర్శక నిర్మాతలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. వేరే నిర్మాత ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్‌లో ఎప్పుడూ నా సినిమాను విడుదల చేయలేదు. కానీ ఈసారి తప్పడం లేదు’ అని చెప్పుకొచ్చారు ఆమిర్.
Also Read: