West Bengal elections 2021 : పశ్చిమ బెంగాల్.. అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు తెరపడనుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడుత పోలింగ్ గురువారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘటం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏడు విడతల్లో 259 అసెంబ్లీ సీట్లల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. చివరి ఎనిమిదో విడతలో.. మిగతా 35 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 35 స్థానాల్లో 283 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 84 లక్షల మందికిపైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మల్దా జిల్లాలో 6, ముర్షిదాబాద్‌లో 11, కోల్‌కతా నార్త్‌లో 7, బిర్‌భూమ్ పరిధిలో 11 నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. వీటి పరిదిలో 11,860 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
కాగా.. గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. 35 నియోజకవర్గాల పరిధిలో 641 కంపెనీల బలగాలను మోహరించింది. కేవలం బిర్‌భుమ్ జిల్లాలోనే 224 కంపెనీల బలగాలను నియమించింది. కరోనా దృష్ట్యా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. అన్నిచోట్ల టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోరు నెలకొంది. కాంగ్రెస్ – వామపక్ష కూటమి కూడా పోటీచేస్తోంది. కొన్నిచోట్ల టీఎంసీ – బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొండగా.. మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది.
కాగా.. ఎనిమిదో విడత పోలింగ్ ప్రక్రియ ముగియగానే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా విడుదల కానున్నాయి. బెంగాల్‌తో పాటు తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి ఆయా ఏజెన్సీలు సర్వేలను బహిర్గతం చేయనుండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
Also Read: