WB Polls 2021: కీలక ఘట్టానికి చేరిన బెంగాల్ ఎన్నికలు…టీఎంసీ-బీజేపీ మధ్య హోరాహోరీ
West Bengal Election 2021 - 5th Phase: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. మొత్తం ఎనిమిది విడతల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతలు పూర్తయ్యాయి.
West Bengal Polls 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. మొత్తం ఎనిమిది విడతల్లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 135 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. మిగిలిన 159 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని బెంగాలీ ఓటర్లు మరో రెండు వారాల్లో తేల్చనున్నారు. కీలకమైన ఐదో విడత ఎన్నికలు ఏప్రిల్ 17న జరగనుండగా….చివరి విడత ఎన్నికలు ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పాటు మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన నాలుగు విడతల ఎన్నికలు అధికార టీఎంసీ, బీజేపీలకు ఎంతో కీలకం. ఎందుకంటే..?
మొదటి దఫాలో మార్చి 27న 30 స్థానాలు…రెండో విడతలో ఏప్రిల్ 1న మరో 30 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా…మూడో విడతలో ఏప్రిల్ 6న మరో 31 స్థానాలు…నాలుగో విడతలో ఏప్రిల్ 10న 44 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 17న(శనివారం) ఐదో విడతలో మరో 45 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఐదో విడత పోలింగ్ జరగనున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించింది. ఇక్కడ తృణాముల్ కాంగ్రెస్ పార్టీ 41.5 శాతం ఓట్లు మాత్రమే సాధించగా…బీజేపీ దాదాపు 45 శాతం ఓట్లు సాధించింది. 2016లో ఇక్కడ తృణాముల్ కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో విజయం సాధించింది. 2011లో ఆ పార్టీకి ఇక్కడ 26 మంది సభ్యులున్నారు.
ఏప్రిల్ 22న ఆరో విడత ఎన్నికల్లో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో తృణాముల్ కాంగ్రెస్‌కి స్పష్టమైన ఆధిక్యముంది. 2011లో ఇక్కడ టీఎంసీ 28 స్థానాల్లో గెలుపొందగా…2016లో నాలుగు స్థానాలు అదనంగా 32 స్థానాలు గెలుచుకుంది. 2016లో ఇక్కడ కాంగ్రెస్-వామపక్ష కూటమి 11 స్థానాల్లో గెలుచుకోగా…ఈ సారి అక్కడ ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మధ్యే నెలకొంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 24 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఎంసీ, 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యం చాటుకుంది.
ఏడు, ఎనిమిది విడతల్లో మొత్తం 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 22న జరిగే ఏడో విడత పోలింగ్‌లో 36 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఇక్కడ 2011 ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలిచిన టీఎంసీ…2016లో 14 స్థానాలు సాధించింది. టీఎంసీపై కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంది. ఆ కూటమి 2016 ఎన్నికల్లో 22 స్థానాలు గెలుచుకోగా…2011లో 18 స్థానాల్లో విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ తలా 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో నిలవగా…మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది.
ఏప్రిల్ 29న చివరి విడతలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా…ఇక్కడ 2011లో 17 స్థానాలు, 2016లో 17 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది. 2016లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 16 స్థానాల్లో గెలుచుకోగా…2011లో ఈ కూటమి 21 స్థానాల్లో గెలుచుకుంది. చివరి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 2016లో బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగా…2019 లోక్‌సభ ఎన్నికల్లో 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం చాటుకుంది. టీఎంసీ 19 అసెంబ్లీ సెగ్మెంట్లు, కాంగ్రెస్ 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో నిలిచాయి.
2019 లోక్‌సభ ఎన్నికలు బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంఎంసీ, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొనగా…ప్రస్తుతం టీఎంసీ, బీజేపీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. వచ్చే రెండు వారాల్లో జరిగే తదుపరి జరిగే నాలుగు విడతల ఎన్నికల్లో అధికార తృణాముల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. హోరాహోరీ పోరులో విజేతలు ఎవరో తేలేది మాత్రం మే రెండునే.
ఇవి కూడా చదవండి…హరిద్వార్ మహాకుంభ్‌మేళా సూపర్ స్ప్రెడర్‌గా మారే ప్రమాదం ఉందంటున్న అధికారులు.. పోలీసులు మాత్రం కాదంటున్నారు..
జీహెచ్‌ఎంసీలోనే అత్యధిక కరోనా కేసులు.. నిన్న రాష్ట్రంలో ఎన్ని నమోదయ్యాయో తెలుసా..?