West Bengal Assembly elections : బెంగాల్ సీఎం మమతపై సువేందు అధికారి, రేపు కోల్‌కతాలో బీజేపీ మెగా ర్యాలీకి ప్రధాని

|

Mar 06, 2021 | 9:59 PM

West Bengal Assembly elections : బెంగాల్‌లో ఎన్నికల యుద్దం మరింత రక్తికట్టింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారి ని బరిలోకి దింపింది బీజేపీ. గెలుపు..

West Bengal Assembly elections :  బెంగాల్ సీఎం మమతపై సువేందు అధికారి, రేపు కోల్‌కతాలో బీజేపీ మెగా ర్యాలీకి ప్రధాని
బ్రిగేడ్‌లో తొలిసారిగా ఎర్ర జెండా, తేరంగ పక్కన ఐఎస్‌ఎఫ్ జెండా ఎగిరింది
Follow us on

West Bengal Assembly elections : బెంగాల్‌లో ఎన్నికల యుద్దం మరింత రక్తికట్టింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారి ని బరిలోకి దింపింది బీజేపీ. గెలుపు నాదంటే నాదే అని ఇద్దరు నేతలు చెబుతున్నారు. ఆదివారం కోల్‌కతాలో బీజేపీ మెగా ర్యాలీకి హాజరవుతున్నారు ప్రధాని మోదీ. ఇక, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసింది. 57 మంది అభ్యర్ధులతో తొలిజాబితాను విడుదల చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌.. నందిగ్రామ్‌ నుంచి సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారిని అభ్యర్ధిగా ప్రకటించింది బీజేపీ . కొద్దినెలల క్రితమే తృణమూల్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు సువేందు. ఏరికోరి నందిగ్రామ్‌ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు మమత. తృణమూల్‌కు సువేందు అధికారి నమ్మకద్రోహం చేశారని , అందుకే ఆయనకు గుణపాఠం చెప్పేందుకు అక్కడ బరిలోకి దిగినట్టు ప్రకటించారు. సువేందుపై 50 వేల ఓట్లతో గెలుస్తానని మమత సవాల్‌ విసిరారు.

బెంగాల్‌ ఎన్నికల్లో ఇప్పుడు అందరి కళ్లు నందిగ్రామ్‌ పైనే ఉన్నాయి. గెలుపు ఎవరిదన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నందిగ్రామ్‌ తన కంచుకోట అని అన్నారు సువేందు అధికారి .. అందుకే 200 శాతం మమత ఓటమి ఖాయమన్నారు. నందిగ్రామ్‌తో మమతకు ఎలాంటి సంబంధాలు లేవని , ఆమె ఔట్‌ సైడర్‌ అని విమర్శించారు. తృణమూల్‌ ఓటమి.. బీజేపీ గెలుపును ప్రజలు నమ్ముతున్నానని చెప్పారు. గతంలో మమతకు కుడిభుజంలా వ్యవహరించిన సువేందు ఇప్పటి ఎన్నికల్లో ప్రత్యర్ధిగా మారారు. నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికి రెండో దశ పోలింగ్‌లో ఏప్రిల్‌ 1న ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మమతాబెనర్జీ 291 మంది అభ్యర్ధులతో తృణమూల్‌ జాబితాను విడుదల చేశారు. తాను బెంగాల్‌ బిడ్డనని .. బీజేపీ ఢిల్లీ పార్టీ అని విమర్శిస్తున్నారు మమత. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ ప్రధానంగా తృణమూల్‌- బీజేపీ పార్టీల మధ్యే ఉంది. కాంగ్రెస్‌-లెఫ్ట్‌ పార్టీలు కూడా కూటమిగా బరిలోకి దిగాయి. మమతా బెనర్జీకి అసెంబ్లీ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి , తృణమూల్‌కు రాజీనామా చేసిన ఎంపీ దినేశ్‌ త్రివేది బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తునట్టు ఆ క్షణం వచ్చేసిందని అన్నారు దినేశ్‌ త్రివేది.

Read also : Fake HRC : అమీన్ పూర్ స్థలాలపై కన్ను, పైకి పెద్ద ఆఫీసర్‌లా బిల్డప్, హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్