పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ మరోసారి అధికారం దక్కించుకున్నారు. బెంగాల్ లో విచిత్రం ఏమిటి అంటే ప్రముఖులు ఓటమి చెందారు. నందిగ్రామ్‌లో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతాబెనర్జీ ఓడిపోయారు. నందిగ్రామ్ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది.
ముందు నుంచి హోరాహోరీగా సాగిన ఈ పోరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. తొలుత మమత విజయం సాధించారని వార్తలు వెలువడగా.. అనంతరం సువేందు గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కౌంటింగ్ ప్రారంభంలో సువేందు ఆధిక్యంలో దూసుకెళ్లారు. నాలుగు రౌండ్ల తర్వాత కూడా ఆయన 8వేల ఓట్ల ముందంజలో కొనసాగారు. ఆ తర్వాత మమత పుంజుకొని ఆధిక్యంలోకి వెళ్లారు. ఒక్కో రౌండ్ ఒక్కొక్కరి ఆధిపత్యం అన్నట్టు లెక్కింపు కొనసాగింది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి సువేందు మమత కంటే కేవలం 6 ఓట్ల ముందంజలో ఉన్నారు. చివరిదైన 17వ రౌండ్‌లో స్వల్ప ఆధిక్యంతో గెలుపుతీరాలకు చేరారు.
ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర సహాయమంత్రి సహా నలుగురు ఎంపీలను బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి, ప్రముఖ గాయకుడు బబూల్ సుప్రియో కూడా ఓటమి చెందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొంది, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టోలీగంజ్ నుంచి బరిలోకి దిగారు. తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో బబూల్ సుప్రియో ఓటమి చెందారు.
వీరిలో ఎంపీ నిషిత్ ప్రామాణిక్ మినహా మిగతా వారు ఓడిపోయారు. దిన్‌హటా స్థానం నుంచి పోటీ చేసిన ఎంపీ నిషిత్ ప్రామాణిక్ మాత్రం తన సమీప టీఎంసీ ప్రత్యర్థిపై 5,175 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చున్‌చురా నుంచి పోటీ చేసిన ఎంపీ లాకెట్ ఛటర్జీ, తారకేశ్వర్ నుంచి బరిలోకి దిగిన రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా టీఎంసీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు.
Also Read: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు