PM-Kisan Samman Nidhi West Bengal : ముఖ్యమంత్రి మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రజల్ని అన్ని విధాలా మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రతినిధి సంబిత్ పత్రా విమర్శించారు. పౌరుషానికి, పంతాలకు పోయి అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను బెంగాల్ లో అమలు చేయకుండా ప్రజల్ని నట్టేటముందచిందని ఆయన ఖరగ్ పూర్ లో ఆరోపించారు. రైతన్నలకు ఎంతో తోడ్పాటునిచ్చే ‘పీఎం-కిసాన్ సమ్మన్ నిధి’ బెంగాల్ రైతాంగానికి అందకుండా రాష్ట్ర రైతులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంచించారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కేవలం మోదీ సర్కారుపై ఉన్న ద్వేషంతోనే “పిఎం-కిసాన్ సమ్మన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు కలిగేంచే ప్రయోజనాలను మమతా బెనర్జీ అడ్డుకున్నారన్నారు. ఈ పథకంలో లబ్ధిపొందేందుకు బెంగాల్ రైతులు దరఖాస్తు చేసుకున్నారని , కాని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని పత్రా ఆరోపించారు. “పశ్చిమ బెంగాల్ గడ్డ నుండి ఈ విషయాన్ని ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తున్నానని.. బీజేపీ అధికారంలోకి వస్తే కిసాన్ సమ్మన్ నిధిని బెంగాల్ లో అమలు చేస్తామని పత్రా చెప్పారు. అంతేకాదు, ఈ పథకం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేసిన రోజు నుండి బకాయిలతో పాటు బెంగాల్ రైతులకు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 75 లక్షల మంది రైతులకు సంవత్సరానికి రూ .10,000 చొప్పున ఇస్తామని సంబిత్ పత్రా చెప్పారు. “కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు ఇస్తుంది. మేము అధికారంలోకి వస్తే, మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తానికి రూ .4000 కలుపుతుంది” అని పత్రా తెలిపారు. ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుండి ఎనిమిది దశల్లో జరుగుతాయి. చివరి రౌండ్ ఓటింగ్ ఏప్రిల్ 29 న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన చేస్తారు.